ఎపికి బిజెపి ద్రోహం

ys sharmila meet sitaram yechury in delhi

 ఎపి కాంగ్రెస్‌ నేతలతో ఏచూరి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌కు బిజెపి ద్రోహం చేసిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. శుక్రవారం నాడిక్కడ సిపిఎం కేంద్ర కార్యాలయంలో సీతారాం ఏచూరిని ఎపిసిసి అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు కెవిపి రామచంద్రరావు, రఘువీరారెడ్డి, జెడి శీలం, గిడుగు రుద్రరాజు, తులసి రెడ్డి, మస్తాన్‌ వలి, సుంకర పద్మశ్రీలతో కూడిన బృందం కలిసింది. ఈ సందర్భంగా ఎపి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని సీతారాం ఏచూరిని కోరారు. దీనికి స్పందించిన ఏచూరి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు కాంగ్రెస్‌ పోరాటానికి సిపిఎం మద్దతు ఉంటుందని అన్నారు. సిపిఎం మొదటి నుంచీ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం పోరాడుతుందని తెలిపారు. రాష్ట్రానికి బిజెపి ద్రోహం చేసిందని, విభజన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని విమర్శించారు. ఏపికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని బిజెపి నేతలు అడిగారని, ఇప్పుడు వాళ్లు మాత్రం ఇవ్వడం లేదని విమర్శించారు. ఎపిసిసి అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం సిపిఎం మద్దతు కోరామని తెలిపారు. ఏపి ప్రజలను బిజెపి మోసం చేసిందని విమర్శించారు. విభజన హామీలు అమలు చేయని బిజెపికి వైసిపి, టిడిపి గులాం గిరి చేస్తున్నాయని అన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సాధనకు చివరి వరకు పోరాటం చేస్తామని అన్నారు. శరద్‌ పవార్‌, తిరుచ్చి శివలను కలిసిన కాంగ్రెస్‌ బృందం అంతకు ముందు ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌, డిఎంకె రాజ్యసభ పక్షనేత తిరుచ్చి శివలను వారి నివాసంలో, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేని ఎపిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు కెవిపి రామచంద్రరావు, రఘువీరారెడ్డి, జెడి శీలం, గిడుగు రుద్రరాజు, తులసి రెడ్డి, మస్తాన్‌ వలీ, సుంకర పద్మశ్రీలతో కూడిన బృందం కలిసింది. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు కోరారు. డిఎంకె ఎంపి తిరుచ్చి శివ మాట్లాడుతూ ”ఏపి ప్రత్యేక హోదా, విజభజన హామీలు కేంద్రం నెరవేర్చలేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. డిఎంకె పార్టీ తరపున రాజ్యసభలో ఈ అంశాన్ని లెవనెత్తుతా. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. ఏపికి మా సహకారం కొనసాగుతుంది” అని అన్నారు.

➡️