పిఠాపురం నుంచి పవన్‌ పోటీ

Mar 14,2024 23:50 #pawan kalyan, #press meet
  •  రాష్ట్ర భవిష్యత్‌ కోసమే త్యాగాలు : జనసేనాని

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎన్నికల పోటీపై నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు తొలగిపోయింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ఆయన గురువారం ప్రకటించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోషల్‌ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. శ్రీపాద వల్లభుడు జన్మించిన పవిత్ర స్థలమైన పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ‘వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేయాలని కొందరు.. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లాలని మరికొందరు కోరుతున్నారు. నాకు మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంది. పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తాను. ఎంపిగా కూడా పోటీచేయాలన్న దానిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటా’ అని పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో వందశాతం స్ట్రైక్‌ రేట్‌ ఉండేలా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని, టిడిపి, బిజెపితో కూడిన పొత్తును అందరూ ఆశీర్వదించి కూటమి అభ్యర్థులను గెలిపించా లని ఆయన పిలుపునిచ్చారు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిత కోసం ఎన్నికల్లో పోటీ చేసే కొన్ని సీట్లు త్యాగం చేయక తప్పలేదని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం పొత్తులో భాగంగా కొందరికి అవకాశం ఇవ్వలేకపోయామని, ఆఖరుకు తన సొంత అన్నయ్య నాగబాబుకు కేటాయించిన సీటును కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పవన్‌కల్యాణ్‌ వివరించారు.
అప్పు చేసి పంచితే సంక్షేమం అవ్వదు
అప్పు చేసి డబ్బు పంచితే సంక్షేమం అవ్వదని, ఆ అప్పును మళ్లీ కట్టాల్సింది రాష్ట్ర ప్రజలేనని ఆయన తెలియజేశారు. తెచ్చిన డబ్బులో సగం సిఎం జగన్‌ నొక్కేస్తుంటే.. మరికొంచెం ఆయన సభలకు, సమావేశాలకు, ప్రచారాలకు సరిపోతుందని ఆరోపించారు. జనాన్ని కన్నీరు పెట్టించిన ప్రభుత్వం.. ఆ కన్నీటితోనే కూలిపోతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

➡️