‘ఉక్కు’ను కాపాడే వారికే ఓటు

Mar 11,2024 08:04 #ukkunagaram, #visakha steel

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం): వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు అజెండాలో పెట్టాలని, అటువంటి వారికే కార్మికులు రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయనున్నారని హెచ్‌ఎంఎస్‌ స్టీల్‌ప్లాంట్‌ విభాగం అధ్యక్షులు దొమ్మేటి అప్పారావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 1123వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో హెచ్‌ఎంఎస్‌ యూనియన్‌ కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో కలపాలని, తద్వారా నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఉక్కు ప్రయివేటీకరణ ఆగే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్లాంట్‌పై రాజకీయ పార్టీలు నాటకాలు కట్టిపెట్టి సరైన వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ వల్లే విశాఖ ఇంతలా అభివృద్ధి చెందిందన్న అంశాన్ని గుర్తెరగాలన్నారు. దీక్షల్లో సంఘం స్టీల్‌ప్లాంట్‌ విభాగం ప్రధాన కార్యదర్శి జి గణపతి రెడ్డి, కాంట్రాక్టు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సత్యారావు, నాయకులు ఉరుకూటి అప్పారావు, డి ఈశ్వరరావు, ప్రభు కుమార్‌, జి రమణారెడ్డి, గోవిందు, రమణరాజు పాల్గొన్నారు.

➡️