‘ఉక్కు’ పరిరక్షణకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధం

Mar 22,2024 23:40 #ukkunagaram, #visakha steel

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం)వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోవడం కోసం ఎలాంటి త్యాగాలకైనా ఉక్కు కార్మికులు సిద్ధంగా ఉన్నారని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి ఆదినారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 1135వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్‌ టిపిపి, ఆర్‌ఇడి, పిఇఎం, స్టోర్స్‌, ఎస్‌ఎండి విభాగాల కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు కార్మికులను మానసికంగా, ఆర్థికంగా కుంగదీయాలని చూస్తున్న ప్లాంట్‌ యాజమాన్య చర్యలను తీవ్రంగా ఖండించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి, పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపే వరకూ, ప్రయివేటీకరణ విరమించే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

➡️