సార్వత్రిక ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు – సిఇఒ ఎంకె మీనా

Feb 3,2024 08:25 #video conference, #Voter List

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు. సచివాలయంలోని ఆయన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల సంసిద్ధత, ఓటర్ల జాబితాపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంకె మీనా మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన, నోటిఫికేషన్‌ జారీకి ఎక్కువ సమయం లేదన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తాజా మార్గదర్శకాలను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపినట్లు పేర్కొన్నారు. వాటిపై ఎన్నికల అధికారులు సమగ్ర అవగాహనను పెంపొందించుకుని చర్యలు తీసుకోవాలన్నారు. జిలాల వారీ సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సున్నితమైన, సమస్యాత్మకమైన పోలింగ్‌ స్టేషన్లతో పాటు 1200 మంది ఓటర్లకు పైబడి ఉన్న పోలింగ్‌ స్టేషన్లకు తప్పనిసరిగా వెబ్‌ టెలీకాస్టింగ్‌కు సంబంధించి తాత్కాలిక నివేదికను వెంటనే తమకు పంపాలన్నారు. ప్రతి జిల్లాలోనూ కనీసం 50 శాతం పోలింగ్‌ స్టేషన్లు వెబ్‌ టెలీకాస్టింగ్‌లో కవర్‌ చేయాలన్నారు. వెబ్‌ టెలీకాస్టింగ్‌ చుట్టుపక్కల పరిసరాలను కూడా కవర్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు, కనీస మౌలిక వసతుల కల్పన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. వికలాంగులు, వయో వృద్ధులైన ఓటర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వీరికి అవసరమైన ర్యాంపుల నిర్వహణ పనులు ఈ నెల 5కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలని, మాస్టర్‌ ట్రైనర్ల ద్వారా శిక్షణ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రతిజిల్లాకు సంబంధించిన జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక ముసాయిదా ప్రతిని వచ్చే సోమవారాని కల్లా తమ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల సమన్వయంతో అక్రమ నగదు, లిక్కరు, ఇతర సామగ్రి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేవలం రాష్ట్ర సరిహద్దుల్లోనే కాకుండా జిల్లాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై కూడా నిఘా పెంచాలని అన్నారు. ఇందుకు సంబంధించిన నివేదికలను కూడా పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతోపాటు అదనపు ఇసిఒ పి కోటేశ్వరరావు, ఎమ్‌ఎన్‌ హరీంధర ప్రసాద్‌, డిప్యూటీ సిఇఒలు ఎస్‌ మల్లిబాబు, కె విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.

➡️