గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం

Jan 23,2024 10:30 #Republic Day 2024, #Telangana
  • ప్రజాస్వామ్య పరిరక్షణ.. ఉద్యమ స్ఫూర్తే ఇతివృత్తంగా ప్రదర్శనకు సిద్ధం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ‘స్వీయ పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తి’ ఇతివృత్తంతో తెలంగాణ శకటం సిద్ధం అయింది. 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో జనవరి 26న కర్తవ్య పథ్‌లో వికసిత్‌ భారత్‌ థీమ్‌లో భాగంగా తెలంగాణ శకటాన్ని ప్రదర్శించనున్నారు. నిరంకుశ విధానాలు, రాజరిక, ఫ్యూడల్‌ వ్యవస్థలకు వ్యతిరేకంగా తెలంగాణలో జరిగిన ఎన్నో ప్రజా ఉద్యమాలను గుర్తు చేస్తూ రూపొందించిన శకటం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నది. దాదాపు మూడేళ్ల అనంతరం ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం ప్రదర్శనకు చోటు దక్కింది. 2015, 2020 సంవత్సరాల అనంతరం ఈ సంవత్సరమే తెలంగాణ శకటానికి అవకాశం దక్కింది. ఈ సంవత్సరంతో పాటు వచ్చే మరో రెండేండ్ల పాటు కూడా తెలంగాణా శకటం ప్రదర్శనకు అనుమతి లభించింది. నిరంకుశ విధానాలు, రాజరిక, ఫ్యూడల్‌ వ్యవస్థలకు వ్యతిరేకంగా తెలంగాణలో ఎన్నో ప్రజా ఉద్యమాలు వచ్చాయి. దీనిలో భాగంగా కొమరం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధులు ఎందరో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వయం పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణకై తమ తమ పంథాలో పోరాటాన్ని చేశారు. ఈ స్వీయ పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి ప్రపంచానికి తెలియచేసే విధంగా రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకలో ప్రదర్శనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సలహాతో శకటాన్ని రూపొందించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తోడ్పాటుతో అతి స్వల్ప సమయంలో ఈ శకటం ఏర్పాటైంది. కొమురంభీం, రాంజీ గోండ్‌, చిట్యాల ఐలమ్మల వీరోచితమైన పోరాటాలు ఈ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని, అట్టడుగు వర్గాల్లో ప్రజాస్వామ్య విలువలను కొనసాగించేలా తెలంగాణా ప్రభుత్వ నిబద్ధతకు ఈ శకటం ప్రత్యేకంగా నిలవనున్నది.

➡️