గీతకార్మికుల బతుకులు దుర్భరం

– ప్రభుత్వం వారిని ఆదుకోవాలి : ఎమ్మెల్సీ ఐవి

– ముగిసిన కల్లుగీత కార్మిక సంఘం 15వ రాష్ట్ర మహాసభ

ప్రజాశక్తి – తణుకు రూరల్‌ (పశ్చిమగోదావరి జిల్లా): వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గీత కార్మికుల బతుకులు మరింత దుర్భరంగా మారాయని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం స్పందించి గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎపి కల్లుగీత కార్మిక సంఘం 15వ రాష్ట్ర మహాసభ చిటకన వెంకటేశ్వరరావు నగర్‌లో రెండో రోజు బుధవారం ఉత్సాహపూరితంగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 250 మంది గీత కార్మికులు ప్రతినిధులుగా హాజరయ్యారు. తొలుత మహాసభ ప్రారంభ సూచికగా సంఘం పతాకాన్ని రాష్ట్ర అధ్యక్షులు జుత్తిగ నరసింహామూర్తి ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల మరణించిన ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ, ఉద్యమ నిర్మాత ఎస్‌ఆర్‌ దాట్ల, చిటకన వెంకటేశ్వరరావులకు నివాళులర్పించారు. మహాసభకు అధ్యక్షవర్గంగా నేతలు జుత్తిగ నరసింహామూర్తి, కామన మునిస్వామి, గుబ్బల నాగమణి, స్టీరింగ్‌ కమిటీగా యర్రా దేముడు, ఎం.స్టాలిన్‌ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లలో 200 మంది గీతన్నలు చనిపోయారని, మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని విమర్శించారు. పాక్షిక, శాశ్వత అంగవైకల్యానికి రూ.50 వేలు చెల్లించాల్సి ఉండగా అతీగతీ లేదన్నారు. చెట్లకు ఉన్న మార్కింగ్‌ తీసేసి చెట్లను నరికేస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లుగీత కార్మికులకు కేరళ ప్రభుత్వం అమలు చేస్తోన్న విధానాలను మన రాష్ట్రంలో ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, గాయపడిన వారికి నష్టపరిహారం చెల్లించాలని, నీరా ప్రాజెక్టు అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి.రమణ మాట్లాడుతూ రాష్ట్రాలు వేరైనా, పాలకులు మారినా గీత కార్మికుల కష్టాలు మాత్రం తీరడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో గీతన్నల సత్తా ఏమిటో చూపిస్తామని ఎపి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యర్రా దేముడు అన్నారు. ఆయన కార్యదర్శి నివేదిక ప్రవేశపెడుతూ ఐక్యంగా ఉన్న వృత్తిదారులను కులాలవారీగా విడదీసిన ఘనత వైసిపిదేనన్నారు. అనంతరం ఉద్యమ సీనియర్‌ నాయకులు, అతిథులను ఎమ్మెల్సీ ఐవి సత్కరించారు. కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ ఎం.భాస్కరయ్య, ప్రొఫెసర్‌ జుత్తిగ చంద్రప్రసాద్‌, మట్టా వెంకట్‌, రాష్ట్ర నాయకులు సిమ్మ అప్పారావు, బత్తిన నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️