గ్రామసేవకుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు నాగయ్య మృతి

ప్రజాశక్తి-యర్రగొండపాలెం (ప్రకాశం జిల్లా) :గ్రామ సేవకుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షులు గుర్రం నాగయ్య (72) గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. బుధవారం సాయంత్రం ఆయన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని మాచర్ల రోడ్డులో గల తన ఇంటికి వెళ్తున్న సమయంలో మోటారుసైకిల్‌ ఢకొీన్నది. ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి ఆయన మరణించారు. గ్రామ సేవకుల సంఘం యర్రగొండపాలెం మండల అధ్యక్షుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన అధ్యక్షులుగా ఉన్న సమయంలో అప్పటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వంతో పోరాడి.. గ్రామసేవకులకు ప్రమోషన్ల జిఒను సాధించారు. ఆ జిఒ ఫలితంగా వేలాదిమంది గ్రామసేవకులు విఆర్‌ఒలుగా ఉద్యోగోన్నతి పొందారు. గుర్రం నాగయ్య మృతదేహాన్ని సిఐటియు, సిపిఎం, సిపిఐ నాయకులు సందర్శించి, నివాళులర్పించారు.

➡️