నిరాశ్రయులను ఆదుకోవాలి

Dec 6,2023 10:38 #Tufan
  • నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి
  • ముంపు ప్రాంతాల్లో సిపిఎం నాయకులు పర్యటన

ప్రజాశక్తి – యంత్రాంగం : తుపాను కారణంగా నీట మునిగిన పలు నగరాల్లోని కాలనీల్లో సిపిఎం నాయకులు సోమవారం పర్యటించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో బాధితులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. బియ్యం, నిత్యావసర వస్తువులు అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.విజయవాడ నగరంలోని 62, 63, 64 డివిజన్లలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పర్యటించారు. నీట మునిగిన, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పల్లపు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరిందన్నారు. నిరాశ్రయులైన పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం నిర్మించిన వివిధ కాలనీల్లో స్లాబులు కారిపోతూ, కూలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో 12వ వార్డు వైఎస్‌ఆర్‌ కాలనీలో మోకాల్లోతు నీరు చేరిన ప్రాంతాలను సిపిఎం నేతలు పరిశీలించి సమస్యను మున్సిపల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కాకినాడ నగరంలో రామకృష్ణారావు పేట, కామేశ్వరినగర్‌, డైరీ ఫారం, సంజరునగర్‌, పర్లోవపేట, సూర్యనారాయణపురం, ఏటిమొగ, గోళీలపేట, జె.రామారావుపేట, మహాలక్ష్మి నగర్‌, ముత్తానగర్‌, జగన్నాథపురం, రెల్లివీధి, అన్నమ్మ ట్యాంక్‌ తదితర ప్రాంతాల్లో సిపిఎం నాయకులు పర్యటించారు. సముద్ర పాయలను కలిపే మెయిన్‌ డ్రెయిన్లలో పూడిక తీస్తే ముంపు నివారణ జరిగే అవకాశం ఉందన్నారు. వర్షాల వల్ల పనులు కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలని కోరారు. తిరుపతి ఉప్పంగి హరిజనవాడలో సిపిఎం నగర కార్యదర్శి టి.సుబ్రమణ్యం, నాయకులు వేణు పర్యటించారు. 70 ఇళ్లల్లోకి నీరు రావడంతో రాత్రంతా వారు జాగారం చేశారని, కనీసం తాగడానికి మంచి నీరు కూడా లేవని తెలిపారు. బిటిఆర్‌ కాలనీలో ఒడిశా ప్రాంతం నుంచి వలసొచ్చిన 200 మంది కార్మికులు కూలి పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి ఒక్కరికీ పది కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.

   

➡️