నోటీసులు, ముందస్తు అరెస్టులు

govt notice anganwadi workers strike 22day

 

  • 5వ తేదీలోగా విధుల్లో చేరాలంటూ అధికారుల హుకుం
  • భగ్గుమన్న అంగన్‌వాడీలు ాఎక్కడికక్కడ నోటీసులు దహనం

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం తలపెట్టిన కలెక్టరేట్ల వద్ద బైటాయింపు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అధికారులు పలు జిల్లాల్లో అంగన్‌వాడీలకు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 5వ తేదీలోగా విధుల్లోకి చేరకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామంటూ ఈ నోటీసుల్లో హెచ్చరించారు. దీంతో, అంగన్‌వాడీలు భగ్గుమన్నారు. ఈ నోటీసులను తగులబెట్టి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. నోటీసులను తీసుకోవడానికి పలువురు తిరస్కరించారు. న్యాయబద్ధమైన తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించకపోగా నోటీసులు ఇవ్వడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ముందస్తు అరెస్టుకు పోలీసులు పాల్పడ్డారు. అంగన్‌వాడీ వర్కర్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా కార్యదర్శి శ్రీదేవిని మంగళవారం సాయంత్రం అరెస్టు చేసి మడకశిర పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న అంగన్‌వాడీలు పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా తాము నిరసన తెలుపుతుంటే ఇలా అరెస్టులు చేయడం ఏమిటని ఎస్‌ఐని నిలదీశారు. పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీలు పోలీసు స్టేషన్‌కు తరలిరావడంతో శ్రీదేవిని విడిచిపెట్టారు. ఈ నెల 5వ తేదీలోగా విధుల్లోకి చేరకపోతే చర్యలు తీసుకుంటామంటూ అధికారులు ఇచ్చిన నోటీసులను విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద అంగన్‌వాడీలు దగ్ధం చేశారు. బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్‌.పురంలో దీక్షా శిబిరాన్ని ఇన్‌ఛార్జి సిడిపిఒ నాగలక్ష్మి సందర్శించి నోటీసులు ఇవ్వగా, అంగన్‌వాడీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటిని తీసుకోవడానికి తిరస్కరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అధికారులు ఇచ్చిన నోటీసులను అంగన్‌వాడీలు దగ్ధం చేశారు. చలో కలెక్టరేట్‌ను అడ్డుకోవడానికి ఏలూరుతో తహశీల్దార్‌ 144 సెక్షన్‌ అమలులోకి తెచ్చారు. శ్రీకాకుళం జిల్లా కోటబమ్మాళిలో సమ్మె శిబిరానికి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శాంతిశ్రీ వచ్చి సమ్మె విరమించాలని కోరారు. ఐదో తేదీలోగా విధులకు హాజరు కాకుంటే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని అంగన్‌వాడీలు తేల్చి చెప్పారు. విజయనగరం జిల్లాలో అంగన్‌వాడీలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమ్మె శిబిరంలో సుజ్ఞానమ్మ అనే కార్యకర్త నీరసించి పడిపోవడంతో ఆమెను తోటి అంగన్‌వాడీలు ఆస్పత్రికి తరలించారు. గ్యాస్‌ సమస్య వల్ల ఈ ఇబ్బంది వచ్చిందని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సమ్మె శిబిరాన్ని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు సందర్శించి మద్దతుగా మాట్లాడారు.

  • డిప్యూటీ సిఎం నారాయణస్వామి కాన్వాయి అడ్డగింత

చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో జాతీయ రహదారిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కాన్వాయిని అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. దీంతో, ఆయన కారు దిగివచ్చి వారితో మాట్లాడారు. ఆయనకు అంగన్‌వాడీలు వినతిపత్రం అందజేశారు. సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని డిప్యూటీ సిఎం హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల మద్దతువిజయవాడలో ధర్నా చౌక్‌లోని అంగన్‌వాడీల సమ్మె శిబిరానికి పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు వచ్చి మద్దతు తెలిపాయి. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు బండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, బెఫీ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.అజరుకుమార్‌, ఎల్‌ఐసి రాష్ట్ర నాయకులు కళాధర్‌ తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం రాత్రికి పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడకు వస్తారని, అంగన్‌వాడీ యూనియన్‌ నేతలను పిలిపించుకుని వారి డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. వీటిని టిడిపి మ్యానిఫెస్టోలో పొందుపరిస్తామన్నారు. సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుండా నోటీసుల పేరుతో బెదిరింపులకు దిగితే మహిళలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ నెల 3న కలెక్టరేట్‌ వద్ద బైటాయించవద్దంటూ నగరంలోని సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌ నుండి అంగన్‌వాడీ వర్కర్లకు తాఖీదులు పంపించడం దారుణమన్నారు. సుబ్బరావమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ బెదిరింపులకు అంగన్‌వాడీలు బెదిరిపోరని స్పష్టం చేశారు. యూనియన్‌ నాయకులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

➡️