పాపిరెడ్డిపాలెంలో భూ పోరాటం

Feb 12,2024 08:12 #cpm dharna, #nelluru

-ఇళ్ల స్థలాల కోసం జెండాలు పాతిన పేదలు

ప్రజాశక్తి- తోటపల్లి గూడూరు (నెల్లూరు జిల్లా)శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా టిపి గూడూరు మండలం టిపి గూడూరు బిట్‌-2 పాపిరెడ్డిపాలెం గ్రామంలో 497, 498 సర్వే నెంబర్లలోని 15 ఎకరాల మిగులు భూమిని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక పేదలు స్వాధీనం చేసుకుని ఎర్ర జెండాలు పాతారు. 500 మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం హద్దులు ఏర్పాటు చేసుకొని స్థలాలు కేటాయించుకున్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భూములు, ఇళ్ల స్థలాల కోసం పేదలు గతంలో పలు దఫాలు వినతిపత్రాలు ఇచ్చారని తెలిపారు. అయినా, అధికారులు స్పందించకపోవడంతో గతంలో భూపోరాటానికి దిగి భూములను ఆక్రమించుకున్నారని గుర్తు చేశారు. వీటికి పట్టాలు ఇస్తామని ఆ సందర్భంగా అధికారులు ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో పేదలు మళ్లీ జెండాలు పాతారని తెలిపారు. పేదలు, వ్యవసాయ కార్మికుల పక్షాన తమ సంఘం నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జన్నలగడ్డ వెంకమ్మ, మంగళ పుల్లయ్య, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️