మున్సిపల్‌ కార్మికులపై బైండోవర్‌ కేసులు – కొనసాగుతున్న సమ్మె

  • పోటీకార్మికులను రాష్ట్రవ్యాప్తంగా అడ్డగింత
  • కొనసాగుతున్న సమ్మె

ప్రజాశక్తి- యంత్రాంగం : మున్సిపల్‌ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా సమ్మెలో ఉన్న వారిని బెదిరించి లొంగదీసుకుంటుంది. పోటీ కార్మికులతో పనులు చేయిస్తూ..వారిని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తోంది. జిల్లాల్లో పోలీసులు దగ్గరుండి పోటీ కార్మికులతో పనులు చేయిస్తున్నారు. అడ్డుకుంటున్న వారిని అరెస్టు చేసి బైండోవర్‌ కేసులు పెడుతున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఐదుగురిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. విశాఖలో 30 మందిని అరెస్టు చేశారు. ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకూ పోరాటం సాగిస్తామని మున్సిపల్‌ కార్మికులు తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మె గురువారంతో పదవరోజుకు చేరింది.

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట బజారువీధిలో పేరుకుపోయిన చెత్తను ఎంపిపి సభ్యులు అల్లూరు అనీల్‌రెడ్డి, కమిషనర్‌ నరేంద్రకుమార్‌ ఆధ్వర్యంలో వైస్‌ చైర్మన్‌ చిన్ని సత్యనారాయణ, కౌన్సిలర్లు కలిసి పోలీసు బలగాలతో తొలగించే కార్యక్రమం చేపట్టారు. ‘మా సమస్యలు పరిష్కరించకుండా, మా పొట్ట కొట్టే చర్యలు చేపట్టొద్దు’ అంటూ వారిని మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులు, వైసిపి ప్రజా ప్రతినిధులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సిఐటియు కార్యదర్శి కె.లక్ష్మయ్య, మరో నలుగురి నాయకులను బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. వీరిపై బైండోవర్‌ కేసు నమోదు చేశారు.

విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం వద్ద చెత్త తరలించడానికి అధికారులు చేసిన ప్రయత్నాన్ని మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బోనా అనిత, పులమరశెట్టి పైడమ్మ, చిట్టిబోయిన రమణ, బేసబోయిన హేమలత, ఎల్లమ్మ సహా 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విడిచిపెట్టారు. జివిఎంసి ఏడో వార్డు కారుషెడ్‌ కూడలి వద్ద మనస్తాపానికి గురైన కార్మికుడు యజ్జల చిన్నా పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటికార్మికులు స్పందించి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విజయవాడ రాణిగారితోట 18వ డివిజన్‌లో క్లాప్‌ ఆటో డ్రైవర్‌ అత్యుత్సాహం ప్రదర్శించి పారిశుధ్య కార్మికురాలు మరియమ్మను ఆటోతో ఢ కొట్టాడు. దీంతో ఆమెకు గాయలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విజయనగరంలో ఎఐటియుసి అనుబంధ సంఘం కార్మికులు కూడా సమ్మెలోకి రావడంతో నగరంలో పూర్తి స్థాయిలో పారిశుధ్య సేవలు నిలిచిపోయాయి. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్‌మోహన్‌ మద్దతు తెలిపారు. పార్వతీపురంలో డప్పు వాయిద్యాలతో, పాలకొండలో చేతికి సంకెళ్లు వేసుకొని నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి, ఉమ్మడి కర్నూలులో నిరసన దీక్షలు కొనసాగాయి. కడపలో ప్రభుత్వ శవయాత్రతో నిరసన తెలిపారు. ఒంగోలులో పొర్లుదండాలు పెట్టి నిరసన తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలో భిక్షాటన చేశారు.

గుంటూరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి జిన్నా టవర్‌ సెంటర్‌ వరకూ ప్రదర్శన నిర్వహించారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోటీ కార్మికులను అడ్డుకోవడంతో మున్సిపల్‌ కార్మికులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పనిముట్లతో కార్మికులు నిరసన తెలిపారు. తాడేపల్లిగూడెంలో పోటీ కార్మికులను పెట్టి పనులు నిర్వహిస్తున్న మున్సిపల్‌ అధికారులను మున్సిపల్‌ కార్మికులు నిలదీశారు. ఏలూరులో వెహికల్‌ డిపో వద్ద చెత్తసేకరణ వాహనాలు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. కోనసీమ, తూర్పుగోదావరి,కాకినాడ జిల్లాల్లో మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాలను కొనసాగించారు. నెల్లూరులో జలకన్య విగ్రహం నుంచి పప్పుల వీధి మీదుగా ఎబిఎం కాంపౌండ్‌ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మెయిన్‌ రోడ్డులో మానవహారం చేపట్టారు. పలాసలో అర్ధనగ ప్రదర్శన, ఇచ్ఛాపురంలో రాస్తారోకో నిర్వహించారు.

➡️