రవాణా రంగ కార్మికులకు సంక్షేమ చట్టం చేయాలి

– ఆలిండియా ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌:రవాణా రంగ కార్మికుల కోసం సామాజిక సంక్షేమ చట్టం చేయాలని ఆలిండియా ట్రాన్స్‌ పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అర్‌.లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. ఆటో, రవాణా రంగ సదస్సును విజయనగరంలోని ఎల్‌బిజి భవనంలో గురువారం నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా పది కోట్ల మంది రవాణా రంగంలో పని చేస్తున్నారని తెలిపారు. వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారమూ అందడంలేదన్నారు. పైగా చలానాలు, పెనాల్టీలు పెంచుతూ వేధింపులకు గురిచేస్తోందని తెలిపారు. రవాణా రంగం కార్మికులకు సంక్షేమ బోర్డు లేదని, ఫలితంగా ప్రమాదాల్లో గాయపడినా, అంగవైకల్యం చెందినా, అనారోగ్యం పాలైనా కుటుంబ పోషణ భారమవుతోందన్నారు. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాద బీమా సౌకర్యంతోపాటు ఇన్సూరెన్స్‌, రుణ సహాయం, పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, పెన్షన్‌ తదితర సౌకర్యాలు కల్పించవచ్చని చెప్పారు. ఇది ప్రభుత్వ బిక్ష కాదని, ఆటో, రవాణా రంగ కార్మికుల హక్కు అని అన్నారు. దీన్ని సాధించుకునేందుకు పోరాటం తప్ప మరో మార్గం లేదని తెలిపారు. 2019 మోటార్‌ వాహన చట్టంలో అగ్రి గ్రేటర్స్‌ను రవాణా రంగంలోకి ఆహ్వానించాలని ప్రతిపాదించారని, అందులో భాగంగానే పోర్టల్‌, రాపిడో, ఓబర్‌, ఓలా, బ్లూ వంటి బహుళ జాతి సంస్థలు రవాణా రంగంలోకి వచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మోటారు వాహన చట్టం కార్మికులకు తీవ్ర నష్టం చేసేదిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రమాదం జరిగినా ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష విధించే కొత్త చట్టం తీసుకొచ్చిందని అన్నారు. దీనివల్ల డ్రైవర్లు అందరూ రోడ్లమీద కాకుండా, జైల్లో ఉండాల్సిందేనని, ఈ పాపంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు భాగస్వాములేనని తెలిపారు. తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేయనున్నామని తెలిపారు. ఆటో యూనియన్‌ నాయకుల లక్ష్మణ దొర అధ్యక్షతన జరిగిన సదస్సులో సిఐటియు నాయకులు ఎ.జగన్మోహన్‌, రెడ్డి శంకర్రావుచ, బి. రమణ, ఆటో యూనియన్‌ నాయకులు రామునాయుడు, శ్రీను, రామారావు, భాస్కరరావు మూర్తి, పైడిరాజు, ఈశ్వరరావు, నారాయణరావు, కార్మికులు పాల్గొన్నారు.

➡️