రాష్ట్ర బడ్జెట్‌..వివిధ పొలిటికల్ పార్టీల స్పందనలు

Feb 7,2024 22:48 #political leaders, #spandana

ప్రజలకు ఉపయోగం లేని బడ్జెట్‌ -టిడిపి అధ్యక్షులు అచ్చెనాయుడు

రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రసంగం రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రమూ ఉపయోగం లేదని, ఐదేళ్ల పాలన మొత్తం అబద్దాలతో ఏకరువు పెట్టారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, శాసనపభాపక్ష ఉపనేత అచ్చెనాయుడు అన్నారు. బడ్జెట్‌ ప్రసంగం అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎదుటివాళ్లను తిట్టడం కోసమే బడ్జెట్‌ ప్రతిపాదనలా ఉంది మినహా రాష్ట్ర సంక్షేమం కోసం ఏమి చేశారో చెప్పలేదని విమర్శించారు. ఐదేళ్లలో ఇసుక, సిమెంటు, గనులు, సహజ వనరులను దోచుకోవడం తప్ప వైసిపి చేసిందేమీ లేదని అన్నారు.

కాకి లెక్కలే -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

మోడీ బడ్డెట్లో అనుసరించిన విధానాలను జగన్‌ కూడా అనుసరించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. జిడిపిలో 16వ స్థానంలో ఉంటే దాన్ని కూడా తప్పుగా చెప్పారని పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో 17వ ర్యాంకులో ఉన్నా ప్రస్తావించలేదని విమర్శించారు. బుగ్గన చెప్పినవన్నీ కాకిలెక్కలేనని తెలిపారు. 12 లక్షల కోట్లు అప్పు ఉంటే తక్కువ చేసి చూపించారని విమర్శించారు. ఇప్పటికీ ఒకటోతేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. పెట్టుబడులు తెచ్చామన్నా ఒక్క కొత్తకంపెనీ లేదని విమర్శించారు.

మోసపూరిత ప్రకటనలు -పిసిసి అధ్యక్షులు షర్మిల

బడ్జెట్లో పేర్కొన్న అంశాలన్నీ తప్పుల తడకలని, సిఎం దోచుకుని మేడలు కోటలు కట్టుకోవడానికి తప్ప దేనికీ పనికిరాదని ఎపిసిసి అధ్యక్షులు వై.ఎస్‌.షర్మిల అన్నారు. ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌పై స్పందించిన షర్మిల బడ్జెట్‌ పేరుతో దోచుకోవడం తప్ప మరొకటి లేదని అన్నారు.

అప్పులు తప్పుల చిట్టా -జైభారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ

బడ్జెట్‌ అప్పులు తప్పుల చిట్టాగా ఉందని జైభారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు వి.వి.లక్ష్మీనారాయణ విమర్శించారు. అప్పులు చేసి డబ్బులు పంచితే అది అభివృద్ధా అని ప్రశ్నించారు. నగదు బదిలీ ద్వారా పేదరికాన్ని తొలగించాలని ఆర్థిక మంత్రి ఆత్మ వంచన ప్రకటనలు చేశారని విమర్శించారు. పిల్లలకు ఇస్తున్న పథకాల్లో వాస్తవాలు లేవని పేర్కొన్నారు.

సాంఘిక సంక్షేమశాఖలకు నిధులు తగ్గింపు-కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెల గారడీతో సాంఘిక సంక్షేమశాఖకు నిధులను తగ్గించిందని కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి విమర్శించారు. సాంఘిక సంక్షేమశాఖ కోసం కేటాయించిన నిధులు నరవత్నాలకు తప్ప దళితుల మౌలిక సదుపాయాలకు లేదని తెలిపారు.

వ్యవసాయ రంగానికి మద్దతు లేదు-ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం

బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మద్దతు లేదని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి విమర్శించారు. మాటలు కోటలు దాటడం తప్ప అడుగులు గడప దాటడం లేదని వ్యాఖ్యానించారు. తుపాన్లో పంటలు దెబ్బతిన్న రైతులకు రూ.1200 కోట్లను మాత్రమే ప్రతిపాదించారని ఇవి ఏ మూలకూ సరిపోవని తెలిపారు. వివాదాస్పదంగా ఉన్న భూహక్కు చట్టం గొప్ప చట్టంగా అభివర్ణిస్తూ మంత్రి ప్రసంగం సాగిందని విమర్శించారు.

32 శాతం అప్పులతో పూడ్చాలని చూశారుఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు

2024-25 బడ్జెట్లో 32 శాతం అప్పులతో లోటు బడ్జెట్‌ను పూడాల్చని చూశారనిఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. అప్పుల సుడిగుండంలో చిక్కుకున్న రాష్ట్రాన్ని బయటపడేయడానికి ప్రజలపై పన్నుల భారాలు వేయడం తప్ప మరొకమార్గం లేదని పేర్కొన్నారు. కొనుగోలుశక్తి పెంచాల్సిన పాలకులు, బటన్‌ నొక్కడం ద్వారా జీవనోపాధికి దెబ్బ తగులుతుందని విమర్శించారు.

➡️