రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లా వ్యకాసం నాయకుడు మృతి

ప్రజాశక్తి-చిలమత్తూరు :రోడ్డు ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రమేష్‌ (40) మరణించాడు. ఈ నెల 19న ఆయన తన ద్విచక్రవాహనంలో వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడ్డారు. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మరణించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం ఓరువాయి గ్రామానికి చెందిన రమేష్‌.. సిపిఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘంలో జిల్లా కోశాధికారిగా ఉన్నారు. ఈ నెల 19న ఆయన తన స్వగ్రామం నుంచి నల్లచెరువుకు ద్విచక్రవాహనంలో వెళ్తుండగా మార్గమధ్యంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు బెంగుళూరుకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.పరిస్థితి విషమించి బుధవారం అర్ధరాత్రి మరణించారు. రమేష్‌ భార్య కూడా మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పేదలు, రైతు కూలీల కోసం చేసిన భూ స్వాధీనం ఉద్యమాల్లో ఆయన ముందుండి పోరాటం సాగించారు. పాత్రికేయునిగా కూడా పనిచేసి ప్రజా సమస్యలపై కథనాలను రాశారు.
సిపిఎం, ప్రజాసంఘాల నేతల నివాళి
రమేష్‌ మృతి విషయం తెలుసుకున్న సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు ఆయనకు నివాళి అర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌, వ్యకాసం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఫిరంగి ప్రవీణ్‌కుమార్‌, పెద్దన్న తదితరులు ఓరువాయి గ్రామానికి వెళ్లి రమేష్‌ భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. గురువారం సాయంత్రం రమేష్‌ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు.

➡️