లోన్‌యాప్‌ వేధింపులకు విద్యార్థి ఆత్మహత్య

Jan 21,2024 08:25 #loan app, #Suicide

ప్రజాశక్తి-రొంపిచర్ల (పల్నాడు జిల్లా) : లోన్‌యాప్‌ వేధింపులు తాళలేక పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలోని పరగటిచర్ల గ్రామానికి చెందిన బిటెక్‌ విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పరగటిచర్ల గ్రామానికి చెందిన గుడిపూడి శ్యాంప్రసాద్‌ కుమారుడు విఘ్నేష్‌ (21) గుంటూరు విజ్ఞాన్‌ కళాశాలలో బిటెక్‌ నాల్గవ సంవత్సరం చదువుతున్నారు. సంక్రాంతి సెలవులకు అతను ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో లోన్‌యాప్‌ వారి నుంచి ఒత్తిడి అధికమైంది. విఘ్నేష్‌ చరవాణిలోని బంధువులు, స్నేహితుల ఫోన్‌ నంబర్లకు తన బాకీ వివరాలు పంపిస్తామని లోన్‌యాప్‌ సిబ్బంది బెదిరింపులకు పాల్పడడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చే సరికి ఫ్యాన్‌కు వ్రేలాడుతూ విఘ్నేష్‌ కనిపించారు. పరీక్షించిన ఆర్‌ఎంపి వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️