విద్యార్థుల మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలి

Mar 1,2024 08:26 #Dharna, #tribal students

– కలెక్టరేట్‌ వద్ద గిరిజనుల ధర్నా

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ :పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో విద్యార్థుల మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద గిరిజన విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అంతకుముందు పార్వతీపురం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తక్షణమే విద్యార్థుల మరణాల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గిరిజన సంక్షేమ సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం చేపట్టారు. గిరిజన సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రంజిత్‌ కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహయ కార్యదర్శి హెచ్‌ సింహాచలం మాట్లాడుతూ.. వారం రోజుల్లో నలుగురు గిరిజన విద్యార్థులు మృతి చెందారని, తక్షణమే విద్యార్థుల మరణాల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మృతి చెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలలకు, కళాశాల వసతి గృహాల్లో ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని నియమించాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డైట్‌ ఛార్జీలు పెంచి పౌష్టికాహారం అందించాలని, సురక్షితమైన తాగునీరు, దోమ తెరలు అందించాలని, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది నియామకం, నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు.

➡️