సమాజం పట్ల బాధ్యత పెంచుకోవాలి

Feb 12,2024 08:10 #balostavalu, #rajamahendravaram

– గోదావరి బాలోత్సవం ముగింపు సభలో వక్తలు

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం :చిన్న వయస్సు నుంచే సమాజం పట్ల బాధ్యతను పెంచుకోవాలని, చదువుతో పాటూ ఆటపాటల్లోనూ రాణించాలని పలువురు వక్తలు విద్యార్థులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఎస్‌కెవిటి డిగ్రీ కళాశాల ఆవరణలో రెండు రోజులుగా జరుగుతున్న గోదావరి బాలోత్సవం ముగింపు వేడుక ఆదివారం జరిగింది. బాలోత్సవం అసోసియేట్‌ అధ్యక్షులు విఎస్‌ఎస్‌.కృష్ణకుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ మాజీ కమిషనర్‌ ఎం.జితేంద్ర, ప్రముఖ నాట్యాచార్యులు సప్పా దుర్గాప్రసాద్‌, శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్‌ అధినేత వేణుగోపాల్‌, ఎల్‌ఐసి బ్రాంచ్‌ మేనేజర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌.శర్మ, ప్రముఖ కవి డాక్టర్‌ అరిపిరాల నారాయణరావు తదితరులు మాట్లాడారు. మంచి సమాజం కోసం అవసరమైన మానవ వనరులను అందించేందుకు ఇటువంటి బాలోత్సవాలు ఎంతో అవసరమన్నారు. ర్యాంకుల, మార్కుల కోసమే అన్నట్లుగా కొనసాగుతున్న ప్రస్తుత విద్యావిధానం వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనమూ లేదని తెలిపారు. విద్యతోపాటు, సమాజం పట్ల బాధ్యతను పెంచుకునేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరముందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి బాలోత్సవాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. గోదావరి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి పిఎస్‌ఎన్‌.రాజు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.తులసి రెండు రోజుల కార్యకలాపాలను వివరించారు. 32 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో సుమారు 5,600 మంది విద్యార్థులు పాల్గన్నారన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ముగింపు సభలో ఎల్‌ఐసి అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఆర్‌.రామ్మోహనరావు, సంఘ సేవకులు మాటూరి సిద్ధార్థ, స్వామి యాడ్స్‌ అధినేత భాస్కర్‌, ప్రముఖ వైద్యులు చైతన్యశేఖర్‌, అమరావతి బాలోత్సవం నిర్వాహకులు టి.క్రాంతికుమార్‌ పాల్గొన్నారు.

➡️