సమాజం మేలుకోరేదే కవిత్వం – ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

Mar 21,2024 23:03 #mlc goreti venkanna, #speech

ప్రజాశక్తి – పాణ్యం (నంద్యాల):సమాజం మేలు కోరేదే కవిత్వమని ప్రముఖ కవి, గాయకుడు, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా గురువారం నంద్యాల జిల్లా పాణ్యంలోని ఆర్‌జిఎం ఇంజనీరింగ్‌ కళాశాలలో సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గోరటి వెంకన్న మాట్లాడుతూ.. రవిగాని చోట కవిగాంచునన్న నానుడి నిజమన్నారు. నేటి సమాజానికి కవిత్వం ఎంతో అవసరమని, దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని, అమానుషత్వాన్ని కవి హృదయం అంగీకరించదన్నారు. కవులను కాపాడుకున్నప్పుడే సమాజ శ్రేయస్సు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ గతిని, స్థితిని మార్చే శక్తి ఒక కవిత్వానికే ఉందన్న నిజాన్ని ఎందరో కవులు నిరూపించారని తెలిపారు. కన్యాశుల్కం లేకుంటే ముదుసలికి కన్యను ఇచ్చి పెళ్లి చేసే విధానం రద్దు అయ్యేదే కాదన్నారు. శ్రీశ్రీ మరుభూమి లేకుంటే రాజరికం మెడలు వంచేది కాదన్నారు. ఇటువంటి ఎందరో కవులు సమాజాన్ని మార్చి లోకహితం చాటారన్నారు. అనంతరం గోరటి వెంకన్నను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది.

➡️