స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయంగా పోరాటం : సిపిఎం

Feb 26,2024 08:16 #ukkunagaram, #visakha steel

ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయంగా కార్మికవర్గం పోరాడాలని సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు కోరారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన రిలే దీక్షలు ఆదివారానికి 1109వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌లోని పలు విభాగాల కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ కర్మాగారాన్ని కాపాడుకోవడానికి సుదీర్ఘకాలంగా ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటం చారిత్రాత్మకమైందని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తిని నిర్వీర్యం చేసి నష్టాల వైపు కర్మాగారాన్ని నడిపి కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తోన్న కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. ఉక్కు పరిరక్షణ పోరాటం తప్పక విజయం సాధిస్తుందని తెలిపారు. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం (సిఐటియు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నమ్మి రమణ, జి.శ్రీనివాసరావు, పోరాట కమిటీ నాయకులు విల్లా రామ్మోహన్‌ కుమార్‌, కెఎస్‌ఎన్‌.రావు, పరంధామయ్య, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️