14న వైసిపిలో చేరనున్న ముద్రగడ

Mar 11,2024 08:00 #Kakinada, #Mudragada

ప్రజాశక్తి – కిర్లంపూడి (కాకినాడ జిల్లా):మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 14న తాడేపల్లిలో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరనున్నట్టు తెలిపారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని తన నివాసరంలో ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు వైసిపిలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. భారీగా కార్లు, బస్సులతో ర్యాలీగా తాడేపల్లికి వెళ్లనున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. ఏ కారణంతో వైసిపిలో చేరుతున్నారు? పవన్‌ కల్యాణ్‌పై పోటీ చేస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో, మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. తనకు గానీ, తన కుమారునికి గానీ ఎటువంటి సీటూ అడగలేదని, ఎటువంటి షరతులు లేకుండానే పార్టీలో చేరుతున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తరుపున ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. వైసిపి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తన పూర్తి స్థాయి సేవను పార్టీకి అందిస్తానని, వైసిపి పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి గెలిచిన తర్వాత ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని, తాను మాత్రం ఏ పదవీ అడగనని చెప్పారు.

➡️