నెత్తురోడుతున్న దండకారణ్యం

Apr 3,2024 07:44 #encounter, #mavoist
  • వేర్వేరు ఘటనల్లో 11 మంది మావోయిస్టుల కాల్చివేత
  • ఈ ఏడాదిలో 43 మంది ఎన్‌కౌంటర్‌

(‘ప్రజాశక్తి విలేకరి- చింతూరు) : దండకారణ్యం నెత్తురోడుతోంది. రెండు వేర్వేరు సంఘటనల్లో 11 మంది మావోయిస్టులను పోలీసులు కాల్చిచంపారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఒక సంఘటనలో తొమ్మిది మంది మావోయిస్టులు మరణించగా, సోమవారం రాత్రి జరిగిన మరో సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత మావోయిస్టుల వేటను ముమ్మరం చేసింది. ఈ ఏడాదిలో ఒక బస్తర్‌ ప్రాంతంలోనే ఏకంగా 43 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ల పేరుతో హతమార్చింది. బస్తర్‌ ఐజి సుందర్‌రాజ్‌ చెప్పిన వివరాల ప్రకారం జాపుర్‌ జిల్లా లెంద్రా గ్రామ సమీపంలోని ఓ అడవిలో మంగళవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో భద్రతాదళాల సంయుక్త బృందం మావోయిస్టుల కోసం గాలింపు జరుపుతుండగా ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టు సీనియర్‌ నాయకుడు పాపారావు ఉనికికి సంబంధించిన సమాచారం అందడంతో భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టాయని, ఈ సందర్భంగా ఎదురుకాల్పులు జరిగాయని ఆయన చెప్పారు. బస్తర్‌ లోక్‌సభ స్థానానికి ఈ నెల 19న తొలి దశలోనే పోలింగ్‌ జరగనుంది. గత నెల నుండే మావోయిస్టులు తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. సాధారణంగా మార్చి-జూన్‌ మధ్యకాలంలో భద్రతాదళాలపై ఎక్కువ దాడులు జరుగుతుంటాయి. గత నెలలో బీజపూర్‌లోని బసగుడా ప్రాంతంలో భద్రతాదళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావో యిస్టులు చనిపోయారు.
మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో దబ్రీ పిట్కాన్‌ సమీపంలోని కేరజారి దండకారణ్యంలో సోమవారం రాత్రి జరిగిన మరో సంఘటనలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పలు ఘటనల్లో నిందితురాలిగా ఉండి రూ.29 లక్షలు రివార్డ్‌ గల డివిసిఎం సజంతి అలియాస్‌ క్రాంతి, రూ.14 లక్షల రివార్డుతో మావోయిస్టు రఘు అలియాస్‌ షేర్‌ సింగ్‌ ఎసిఎం మృతదేహాలను సంఘటనా స్థలంలో స్వాధీనం చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

➡️