మెరిసిన వలస కూలీ బిడ్డ

  • సిఇసిలో రాష్ట్ర స్థాయిలో నీలవేణికి ప్రథమ స్థానం

ప్రజాశక్తి- కవిటి (శ్రీకాకుళం జిల్లా) : చదువుకు పేదరికం అడ్డు కాదని ఓ మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థిని నిరూపించింది. ఆంధ్రా సరిహద్దు గ్రామమైన సొన్నాపూర్‌కు చెందిన బడే నీలవేణి ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో సిఇసి గ్రూపులో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి సత్తా చాటింది. నీలవేణి తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం తమిళనాడు రాష్ట్రంలో చెన్నైకి వలస వెళ్లారు. దీంతో ఆ విద్యార్థిని ఇచ్ఛాపురం మండలం డొంకూరులోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ పదో తరగతి వరకు చదువుకుంది. ఇంట్లో పరిస్థితుల నేపథ్యంలో అక్కడితోనే చదువు ఆపేయాలని సన్నిహితులు చెప్పినా, తన ఇంట పేదరికాన్ని పారదోలాలంటే దానికి చదువే సరైన మార్గమని నిర్ణయించుకుంది. కవిటి మండలం కొత్తపాలెంలోని కెజిబివిలో ఇంటర్మీడియట్‌ సిఇసి గ్రూపులో చేరింది. కళాశాలలో చేరినప్పట్నుంచే నీలవేణికి చదువుపై ఉన్న ఆసక్తిని గమనించిన ప్రిన్సిపల్‌ లక్ష్మీదేవి, కళాశాల సిబ్బంది ఆమెపై ప్రత్యేక శ్రద్ధ వహించి తీర్చిదిద్దారు. పాఠశాల సిబ్బంది తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతిక్షణం తన కుటుంబ నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ నీలవేణి శ్రమించింది. దాని ఫలితంగా ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో సిఇసి గ్రూపులో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది. ఈ సందర్భంగా ‘ప్రజాశక్తి’తో నీలవేణి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి పూట గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల నుంచి వచ్చానని, ఎప్పటికైనా బ్యాంకు కొలువు సాధించడమే లక్ష్యంగా చదువుతున్నానని తెలిపింది. తనలో ఉన్న లోపాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ తన ఉన్నతికి కృషి చేసిన కెజిబివి ప్రిన్సిపల్‌, అధ్యాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది.

➡️