ఇసుక మాఫియా దాడిపై కేసు నమోదు

Mar 30,2024 21:37 #sand mafia attack, #Tenali

– పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు
ప్రజాశక్తి – తెనాలి, కొల్లిపర (గుంటూరు జిల్లా) :గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో ఇసుక మాఫియా విచక్షణారహితంగా దాడికి తెగబడిన సంఘటనలో పోలీసులు ఎట్టకేలకు శనివారం కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని మున్నంగి గ్రామంలో ఇసుక అక్రమ రవాణాను నిలువరించే ప్రయత్నం చేసిన స్థానికులపై శుక్రవారం రాత్రి ఇసుక మాఫియా దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. మున్నంగి ఇసుక రీచ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలను నిలువరించేందుకు గ్రామానికి చెందిన వేమూరి బాలరాజు, అశోక్‌, రాజేష్‌, మరికొందరు ట్రాక్టర్లను అడ్డుకోవడంతో గొడవ చెలరేగింది. ట్రాక్టర్లను అడ్డుకున్న వారిపై ఇసుక మాఫియా దాడికి తెగబడింది. ఈ దాడిలో గాయపడిన బాలరాజు, అశోక్‌, రాజేష్‌ను తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరు గ్రూపుల పరస్పర ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వేమూరి మోషే, వేమూరి చెంచయ్య, వేమూరి సంజరు, వేమూరి అంజి, వేమూరి మల్లికార్జునతోపాటు దాడిలో గాయపడిన బాలరాజు, అశోక్‌, రాజేష్‌పైనా కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆర్‌.రవీంద్రారెడ్డి తెలిపారు. అయితే, వాహనాలు అడ్డుకున్న వారు, ఇసుక తరలిస్తున్న వారు కూడా అధికార పార్టీ కనుసన్నల్లో పని చేసే వ్యక్తులుగా తెలుస్తోంది. ఇసుక రీచ్‌పై ఆధిపత్యం కోసం ఇరు గ్రూపులు దాడులకు తెగబడ్డారని స్థానికులు తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులు కూడా వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

➡️