కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పై కేసు నమోదు

తెలంగాణ : మొఘల్‌ పురా పోలీసు స్టేషన్‌ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పై కేసు నమోదైంది. ఈ నెల 1 వ తేదీన పాతబస్తీ పర్యటన సందర్భంగా …. ఎలక్షన్‌ కమిషన్‌ రూల్స్‌ బ్రేక్‌ చేశారంటూ… కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ వైఎస్‌ ప్రెసిడెంట్‌ జి.నిరంజన్‌ ఢిల్లీ లో ఎన్నికల ప్రధాన అధికారికి మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. చిన్నారులతో ప్రచారం చేయించకూడదని, ఎన్నికల నియమాలను బిజెపి పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏం జరిగిందంటే….
మే 1 న పాతబస్తీలో హైదరాబాద్‌ బిజెపి ఎంపి అభ్యర్థి మాధవి లతకు మద్దతుగా అమిత్‌ షా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాధవి లత మాట్లాడుతుండగా … ఇద్దరు మైనర్‌ బాలికలు వేదికపైకి వచ్చారు. అమిత్‌ షా ఆ ఇద్దరు బాలికలను తన వద్దకు రావాలంటూ … సైగ చేయడంతో వారిద్దరూ షా వద్దకు వెళ్లారు. ఓ చిన్నారి చేతికి ఇచ్చిన బ్యానర్‌లో తామరపువ్వు గుర్తు ఉంది. మరో ఇద్దరు చిన్నారుల వద్ద ఆప్‌ కీ బార్‌ 400 పార్‌ అంటూ ప్లకార్డులు ఉన్నాయి. అయితే ఈ వీడియో వైరల్‌ కావడంతో.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ జరిగిన సంఘటన పై విచారణ చేపట్టాలని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ ను ఆదేశించారు. సీపీ కొత్త కోట శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశాలతో సౌత్‌ జోన్‌ డీసీపీ స్నేహ మెహారాకు ఆదేశాలు జారీ చేశారు. మొఘల్‌ పురా పోలీసులు విచారణ చేసి క్రైం నెంబర్‌ 77/2024, సెక్షన్‌ 188 ఐపీసీ కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎ1)యమాన్‌ సింగ్‌, ఎ2)హైదరాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి మాధవి లత, ఎ3) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా. ఎ4) రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌ రెడ్డి, ఎ5) ఎమ్మెల్యే రాజసింగ్‌ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

➡️