ధూషించిన వారిపై కేసు నమోదు చేయాలి

May 19,2024 23:37 #vavyasaya karmika sangam
  •  వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వ్యవసాయ కార్మికులను కులం పేరుతో ధూషించి దౌర్జన్యానికి పాల్పడిన పెత్తందార్లపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బాపట్ల జిల్లా సంతమాగలూరుకు చెందిన 26 మంది వ్యవసాయ కార్మికులు ప్రకాశం జిల్లా కొండెపి మండలంలోని పొగాకు బ్యారెన్‌లో పనికి వెళ్లారని తెలిపారు. పని పూర్తయిన తర్వాత వారికి ఇవ్వాల్సిన వేతనాన్ని ఇవ్వకుండా పెత్తందార్లు ఇబ్బంది పెట్టారని వివరించారు. చేసిన పనికి వేతనం ఇవ్వాలని నిలదీసినందుకు కులం పేరుతో ధూషించారని పేర్కొన్నారు.
ఈ విషయంపై వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొండెపి పోలిస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారని తెలిపారు. పోలీసులు పెత్తందార్లకు తలొగ్గి దళితులకు న్యాయం చేయలేదని పేర్కొన్నారు. అధికారులు స్పందించకపోవడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ)ను కలిసినట్లు తెలిపారు. సిఇఒ ఆదేశించినా ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏళ్ల తరబడి డిమాండ్‌ చేస్తున్న వలస కార్మికుల చట్టాన్ని చేయాలని కోరారు.

➡️