ప్రధాని సభలో భద్రతా లోపాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి

Mar 19,2024 21:18 #meeting, #pattipati pullarao, #TDP
  • డిజిపిని తక్షణమే తొలగించాలి : పుల్లారావు

ప్రజాశక్తి – చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా చిలకలూరిపేట బొప్పూడిలో ప్రధాని మోడీ పాల్గొన్న బహిరంగ సభలో భద్రతా లోపాలకు కారణం రాష్ట్రంలోని అధికార పార్టీ కుట్రేనని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. లోతైన కుట్రలు దాగి ఉన్న ఈ ఘటనలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ మేరకు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రధాని పాల్గొన్న సభ విషయంలో అధికార వైసిపి ఇలా వ్యవహరించడం అత్యంత దారుణమన్నారు. ప్రధాని సభలో మూడుసార్లు కరెంట్‌ పోవడం, ప్రధాన వేదిక వద్ద భద్రతను సరిగా పట్టించుకోకపోవడం, ట్రాఫిక్‌ నియంత్రణను విస్మరించడం వంటివన్నీ కావాలని చేసినట్లుగానే ఉన్నాయని విమర్శించారు. విపక్షాలకు కీలకమైన భారీ బహిరంగ సభ పర్యవేక్షణ బాధ్యతలు పరమేశ్వర్‌రెడ్డి, తిరుమలేశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, మాధవరెడ్డికి అప్పగించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రధాని భద్రత, జనం రద్దీ నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణ వంటి అంశాలను ఎందుకు పట్టించుకోలేదో ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపించాలని, డిజిపిని తక్షణమే తొలగించి పోలీస్‌ వ్యవస్థ మొత్తం ఇసి ఆధీనంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️