కేంద్రం దిగొచ్చే వరకూ ‘ఉక్కు’ పోరాటం

Dec 3,2023 21:40 #Dharna, #visakha steel

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ అంశంపై కేంద్రంలోని మోడీ సర్కారు దిగొచ్చే వరకూ పోరాటం కొనసాగుతుందని హెచ్‌ఎంఎస్‌ యూనియన్‌ స్టీల్‌ప్లాంట్‌ విభాగం ప్రధాన కార్యదర్శి జి గణపతి రెడ్డి స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 1025వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్‌ కాంట్రాక్టు కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటీకరణ కానిచ్చేది లేదన్నారు. అవసరమైతే తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తామన్నారు. ఉక్కు నిర్వాసితులకు న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించకపోవడం దుర్మార్గమని తెలిపారు. ఆంధ్ర ప్రజల పోరాటాలను గుర్తించి ఇప్పటికైనా ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి, పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్‌ చేశారు. దీక్షల్లో డి నాగరాజు, యు అప్పారావు, జి రమణారెడ్డి, అప్పలరాజు, సత్యారావు, ప్రకాష్‌, లక్ష్మీనారాయణ, పృధ్వీ, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️