గుబులు రేపుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌

May 20,2024 08:04 #Employees, #Postal ballot
  • ఓట్లు చెల్లకపోతే ఎలా?
  •  ఉద్యోగుల్లో ఆందోళన

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పోస్టల్‌ బ్యాలెట్‌ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులు ఉపయోగించుకున్న పోస్టల్‌ బ్యాలెట్లలో ఎన్ని చెల్లకుండా పోతాయోననే ఆందోళన కనబడుతోంది. ఫారమ్‌12/12డి దాఖలు చేసే సమయంలో ఉద్యోగులు ఇచ్చే డిక్లరేషన్‌పై గెజిటెడ్‌ ఆఫీసరు ధ్రువీకరించాల్సి ఉంటుంది. కొన్ని ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో డిక్లరేషన్లపై గెజిటెడ్‌ అధికారులు సంతకం, డిజిగేషన్‌ స్టాంప్‌తోపాటు అఫీషియల్‌ సీల్‌ వేయాల్సి ఉండగా, అనేకచోట్ల అలా జరగకపోవడమే ఉద్యోగుల ఆందోళనకు కారణమవుతోంది. 4.44 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశాన్ని వినియోగించుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 56 వేల పోస్టల్‌ బ్యాలెట్లను ఎన్నికల కమిషన్‌ తిరస్కరించింది. అప్పటి ఎన్నికల్లో 2.62 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్స్‌ను వినియోగించుకోగా, ఈ దఫా ఎన్నికల్లో అన్ని విభాగాలు కలుపుకుని 4.97 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్స్‌లో ఓటర్ల ప్రమేయం లేకుండా జరిగిన లోపాల నేపథ్యంలో గెజిటెడ్‌ సంతకం, అఫీషియల్‌ సీల్‌, డిజిగేషన్‌ స్టాంప్‌ లేని ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలంటూ టిడిపి ఈ నెల 10, 17 తేదీల్లో ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఇప్పటి వరకు ఇసి నుంచి దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

➡️