చేనేత కుటుంబాన్ని ఆదుకోవాలి

Mar 29,2024 21:39 #chenetha, #support the family

– బాధ్యులను కఠినంగా శిక్షించాలి : భాస్కరయ్య
ప్రజాశక్తి-ఒంటిమిట్ట (వైఎస్‌ఆర్‌ జిల్లా) :ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని వృత్తి సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎం.భాస్కరయ్య కోరారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పాల సుబ్బారావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న ఒక్కొక్కరికి రూ.25 లక్షలు చొప్పున వారి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, 3.10 ఎకరాల భూమి, పెద్ద కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కలెక్టర్‌ అధ్యక్షతన న్యాయ విచారణ జరిపి, ఆత్మహత్యకు ముందు రాసిన లేఖను మరణ వాంగ్మూలంగా స్వీకరించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. చేనేత వృత్తిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగాధంలోకి తోసేశాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరనాల శివ నారాయణ మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు వర్క్‌ ఫ్రం షెడ్లు ఏర్పాటు చేయాలని, హ్యాండ్‌లూమ్‌ టెక్స్‌టైల్స్‌ పార్కులు అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.నర్సయ్య, సహాయ కార్యదర్శి సురేష్‌బాబు, సాంబయ్య పరామర్శించిన వారిలో ఉన్నారు.

➡️