సర్టిఫికెట్లలో తప్పుల సవరణ చర్యలు సులభంగా ఉండాలి : హైకోర్టు తీర్పు

ప్రజాశక్తి-అమరావతి : ఇంటర్మీడియట్‌, పదోతరగతి సర్టిఫికెట్లలో పేర్లు, తేదీలు తప్పుగా వస్తే వాటిని సరిచేసే విధానం సులభతరం చేయాలని ఆయా బోర్డులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌ సర్టిఫికెట్లలో విద్యార్థుల పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ తదితర తప్పులను సవరించే విషయంలో కాలపరిమితి దాటి పోయిందని, రికార్డులు కనిపించడం లేదని చెప్పడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను అమలు చేయాల్సిందేనని జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ తీర్పు చెప్పారు. ప్రభుత్వ గుర్తింపు పత్రాల కోసం, ఉద్యోగాల దరఖాస్తులో సర్టిఫికెట్లలోని సమాచారాన్ని వినియోగిస్తున్నారని గుర్తు చేశారు. పాఠశాల రికార్డుల్లో పేర్లు, పుట్టిన తేదీ, ఇంటి పేరు, తల్లిదండ్రుల పేర్లు, కులం, మతం తదితర వివరాల సవరణకు గత ఉత్తర్వులను సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రం మార్పు చేసింది. కలిదిండి గ్రామానికి చెందిన కుందేటి వెంకట నరసయ్య పేరు, తల్లిదండ్రుల పేర్లు పాఠశాల రికార్డుల్లో తప్పుగా నమోదైన కేసు హైకోర్టుకు చేరింది. కోవిడ్‌ కారణంగా మూడేళ్ల లోపు అధికారులను పిటిషనర్‌ ఆశ్రయించలేకపోయారు. రికార్డుల్లో పిటిషనర్‌ కోరిన విధంగా సవరణలు చేయాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు.

➡️