అమలాపురం పోరు ఆసక్తికరం

Apr 30,2024 00:49 #2024 election, #Amalapuram

ప్రజాశక్తి – అమలాపురం : అమలాపురంలో రాజకీయం రసవత్తరంగా మారింది. మొదట్లో టికెట్ల కేటాయింపుపై ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్ష పార్టీ సైతం జాప్యం చేశాయి. అన్ని స్థానాలనూ ప్రకటించినప్పటికీ అమలాపురం వద్దకు వచ్చేసరికి ఆచితూచి అడుగులు వేశాయి. ఎట్టకేలకు అధికార వైసిపి నుంచి టికెట్‌ను మంత్రి పినిపే విశ్వరూప్‌నకు కేటాయించగా, టిడిపి మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావువైపు మొగ్గు చూపింది. కాంగ్రెస్‌ పార్టీ అయితాబత్తుల సుభాషిణిని బరిలో నిలిపింది.
కోనసీమకు అంబేద్కర్‌ పేరును పెట్టడంతో చెలరేగిన అల్లర్లు రాజకీయ నాయకులకు తలనొప్పిగా మారాయి. ఈ అల్లర్లలో మంత్రి పినిపే విశ్వరూప్‌, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్‌కుమార్‌ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వందాలాది మందిపై వైసిపి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఇళ్లను తగులబెట్టడంతో దళితులతోపాటు బిసి తరగతులవారూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దయెత్తున ఆందోళనలు చేపట్టారు. వారికి మద్దతుగా నిలిచారు. అనంతర కాలంలో ఈ కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ గొడవల నేపథ్యంలో కొంత మంది దళిత నాయకులు వైసిపికి దూరంగా ఉన్నారు. కేసులను ఎత్తివేయడంతో ఎంపి మిథున్‌రెడ్డికి ప్రధాన నిందితునిగా ఉన్న బిసిల నాయకుడు వాసంశెట్టి సుభాష్‌ కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇదంతా రాజకీయంగా కలిసొస్తుందని భావించిన వైసిపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమలాపురం వైసిపిలో కీలకంగా ఉన్న నాయకుడు వాసంశెట్టి సుభాష్‌ ఎన్నికలు వచ్చేసరికి ‘సైకిల్‌’ ఎక్కారు. అంతేకాకుండా టిడిపి నుంచి టికెట్‌ సంపాదించి రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా ఇప్పుడు బరిలో నిలిచారు. ఈ ఘటనల నేపథ్యంలో సమీకరణలను లెక్కలు చూసుకున్న ప్రధాన పార్టీలు అమలాపురం అసెంబ్లీ స్థానానికి అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాయి. మొత్తంగా అమలాపురం అల్లర్ల ఘటనలు వైపికి మేలు కంటే కీడే ఎక్కువ చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యవహారంలో టిడిపి, జనసేనను సైతం తప్పుబడుతున్నారు. మొదట్లో అంబేద్కర్‌ పేరు కోసం ర్యాలీల్లో పాల్గొన్న టిడిపి, జనసేన తరువాత ప్లేటు మార్చడంపైనా పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రచారానికి పదును
నామినేషన్ల ఘట్టం కూడా పూర్తవ్వడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వైసిపి అభ్యర్థి పినిపే విశ్వరూప్‌, కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే రెండు పర్యాయాలు నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఇంటింటికీ వెళ్లి మరీ  ఓట్లను అభ్యర్థిస్తున్నారు. దళిత, బిసి సంఘాల నాయకులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించి గెలుపునకు బాటలు వేసుకుంటున్నారు. మరోవైపు టిడిపి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు కూడా ప్రచారంలో వేగాన్ని పెంచారు. కూటమిలో భాగంగా ఉన్న జనసేన, బిజెపి నాయకులను కలుపుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్‌లో నూతనోత్సాహం
దశాబ్ద కాలం అనంతరం అమలాపురంలో మళ్లీ కాంగ్రెస్‌ జెండాలు రెపరె పలాడుతున్నాయి. అమలాపురం నుంచి ఇండియా వేదిక బలపర్చిన అభ్యర్థి అయితబత్తుల సుభాషిణి కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్నారు. వేదికలో ఉన్న సిపిఎం, సిపిఐ, ఆప్‌, ఇతర పార్టీలు ఆమెకు మద్దతుగా నిలిచాయి. నామినేషన్లకు వేదిక పార్టీల నాయకులు పెద్దయెత్తున తరలి వచ్చారు. అంతేకాకుండా ఇటీవల వేదిక తరపున సమావేశాన్ని సైతం నిర్వహించారు.
వేదికలో ఉన్న అన్ని పార్టీలూ సభాషిణి గెలుపునకు కృషి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అలాగే ప్రచారాన్ని సైతం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పదేళ్ల కాలంలో టిడిపి, వైసిపి, బిజెపి చేసిన అన్యాయాన్ని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. దశాబ్ద కాలంగా స్థిరంగా ఉన్న కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు తిరిగి జెండాలు పట్టడంతో కాంగ్రెస్‌ శిబిరంలో నూతనోత్సాహం కనిపిస్తుంది.

➡️