ఆగని మృత్యుఘోష

May 4,2024 07:42 #andrapradesh, #Old-Age Pension
  •  రాష్ట్రంలో మరో పింఛను మరణం
  •  బ్యాంకుల ముందు తప్పని పడిగాపులు
  •  టిడిపి, వైసిపి రాజకీయ లబ్ధి కోసం జనానికి తిప్పలు

ప్రజాశక్తి- యంత్రాంగం : ఎన్నికల్లో లబ్ధి కోసం రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ యంత్రాంగాన్ని వివాదంలోకి నెట్టిన టిడిపి, వైసిపిల నిర్వాకం లబ్ధిదారులకు శాపంగా మారింది. పింఛను డబ్బుల కోసం వృద్ధులు మండుటెండల్లో తిరగాల్సిరావడం, బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సిరావడంతో మృత్యుఘోష ఆగడం లేదు. పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం ఒకరు వడదెబ్బకు గురై మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సొమ్మసిల్లిపోయిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా టిడిపి, వైసిపిలు రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగమైనాయి. పింఛన్ల పంపిణీలో ఈ పరిస్థితి నెలకొనడానికి మీరు కారణమంటే, మీరు కారణమని ఇరు పార్టీల నేతలు విమర్శలకు దిగుతున్నారే తప్ప దొందూదొందే అని ఒప్పుకోరు.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు శివారు చిల్లేవారిపాలెం గ్రామానికి చెందిన వద్ధురాలు ఇంజేటి తాయారు (69) పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లి తిరిగి ఇంటికెళ్లాక వడదెబ్బతో మృతి చెందారు. ఆమె భర్త మసీన్‌ ఇటీవల మరణించారు. దీంతో, ఆమె తన చిన్న కుమార్తె సుజాత ఇంటి వద్ద పెనుగొండ మండలం చినమల్లం గ్రామంలో ఉంటున్నారు. పింఛను కోసం సమీప బంధువు ఆమెను మోటారు సైకిల్‌పై ఆచంట మండలం వల్లూరులోని ఎస్‌బిఐ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రద్దీగా ఉంది. ఆధార్‌ అప్‌డేట్‌ చేయించుకోవాలని బ్యాంకు సిబ్బంది ఆమెకు సూచించారు. దీంతో, ఆమె అక్కడ నుంచి ఆధార్‌ కేంద్రం ఉన్న మట్టావానిపాలెం వెళ్లి ఆధార్‌ అప్‌డేట్‌ చేయించుకున్నారు. అప్పటికే మధ్యాహ్నం కావడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బ్యాంకుకు శనివారం వెళ్దామని బంధువు ఆమెను చిల్లేవారిపాలెం తీసుకెళ్లారు. ఇంటికెళ్లాక సొమ్మసిల్లి పడిపోయి తాయారు మృతి చెందారు. పింఛను కోసం ఎండలో తిరగడం వల్లే ఆమె మృతి చెందారని బంధువులు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని యూనియన్‌ బ్యాంకు వద్దకు పింఛను తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ నేపథ్యంలో జరిగిన తోపులాటలో కిందపడిపోయిన ఒక వృద్ధురాలు స్వల్పంగా గాయపడింది. తెనాలి రూరల్‌ మండలం కొలకలూరు యూనియన్‌ బ్యాంకు వద్ద ఎండలో వృద్దులు ఇబ్బందులు పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం బుచ్చిపాలెం గ్రామానికి చెందిన 72 ఏళ్ల జక్కుల అమ్మిరాజు రెండు రోజులుగా పింఛను కోసం పది కిలోమీటర్ల దూరంలోని బ్యాంకు చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నాడు.. అల్లూరి జిల్లా జికె.వీధి మండలం సీలేరు యూనియన్‌ బ్యాంకు వద్ద పింఛనుదారులు పడిగాపులు కాశారు. దుప్పిలివాడ పంచాయతీ కాట్రగెడ్డ, పిల్లిగెడ్డ గ్రామాలకు చెందిన కొంతమంది తమకు పింఛను డబ్బులు ఖాతాల్లో పడలేదని తెలిపారు. సీలేరులోని యూనియన్‌ బ్యాంకు వద్ద వృద్ధులు తమ ఖాతాల్లో పడిన డబ్బులు తీసుకోవడానికి ఎక్కువసేపు నిరీక్షించాల్సి వచ్చింది.

రెండవరోజూ అందలేదు
వై.రామవరం మండల కేంద్రంలోని ఎస్‌బిఐకి సుమారు 50 కిలోమీటర్లు దూరంలో ఉన్న రేగడిపాలెం, బుల్లెట్‌పాలెం, బూరుగుపాలెం గ్రామాల లబ్ధిదారులకు రెండో రోజు కూడా పింఛను అందలేదు. దీంతో వారు పెన్షన్‌ కోసం వస్తే బస్‌ ఛార్జీలు, భోజనానికి రూ.250 చొప్పున ఖర్చయినట్లు వాపోయారు. చింతూరు మండలం మోతుగూడెం యూనియన్‌ బ్యాంక్‌, పాడేరులోని ఎస్‌బిఐ, యూనియన్‌ బ్యాంకుల వద్ద పింఛనుదారులు పడిగాపులు కాశారు. అరకు సంతబయలు ఎస్‌బిఐ బ్యాంకు పింఛనుదారులతో కిక్కిరిసింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఐఒబి బ్యాంకు వద్ద పింఛనుదారులు బారులు తీరారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో సాంకేతిక కారణాలతో కొంతమంది పింఛను డబ్బులు బ్యాంకు ఖాతాలలో జమ కాలేదు. ఈ విషయం తెలియక డబ్బులు విత్‌డ్రా చేసేందుకు వచ్చిన పింఛనుదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వేపాడ మండలంలో కొందరికి ఎప్పుడో పదేళ్ల క్రితం ఉపాధి పనుల కోసం ప్రారంభించిన జీరో అకౌంట్‌ ఖాతాల్లో పింఛను డబ్బులు పడ్డాయి. ప్రస్తుతం ఈ ఖాతాలు రన్నింగ్‌లో లేకపోవడం, జిల్లా కేంద్రంలో ఆ బ్యాంకులు ఉండడంతో అక్కడికి వెళ్లలేక డబ్బులు తీసుకోలేకపోయారు.

➡️