నంద్యాల టిడిపి పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి భార్య, కుమారుడికి ముందస్తు బెయిల్‌

Apr 2,2024 22:30 #judgement, #telangana high court

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి :భూ వివాదం కేసులో నంద్యాల పార్లమెంట్‌ తెలుగుదేశం ఇన్‌ఛార్జి మాండ్ర శివానందరెడ్డి భార్య, కుమారుడికి మంగళవారం ముందస్తు బెయిల్‌ లభించింది. టిడిపి నంద్యాల పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి, మాజీ ఐపిఎస్‌ అధికారి మాండ్ర శివానందరెడ్డి భార్య ఉమాదేవి, కుమారుడు కనిష్క్‌రెడ్డిని హైదరాబాద్‌ సిసిఎస్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేసి నాంపల్లి కోర్టుకు తరలించేందుకు సిద్ధమవ్వగా దీనిపై శివానందరెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వారిని రెండు రోజుల వరకూ అరెస్టు చేయకూడదని, ఇప్పటికే అరెస్టు చేసినట్లయితే సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించడంతో మంగళవారం వారికి ముందస్తు బెయిల్‌ మంజూరైంది. మరోవైపు శివానందరెడ్డి కూడా తనను అరెస్టు చేయకుండా ఆపాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ ఇంకా విచారణకు రాలేదు.
శివానంద రెడ్డి పరారీలో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో కర్నూలు జిల్లా టిడిపి కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. 2000 సంవత్సరంలో రాజేంద్ర నగర్‌ మండలం బుద్వేల్‌లో భూములు కొన్నానని, 282 ఎకరాలు సెజ్‌ కోసం సేకరించామని తెలిపారు. సెజ్‌ పక్కన ఉన్న స్థలాన్ని కూడా కబ్జా చేశారని ఆరోపిస్తూ వైసిపి నాయకుడు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తనను భూతద్దంలో చూస్తోందని, సిపి శ్రీనివాస్‌ రెడ్డి తనపై కక్ష కట్టి అరెస్టు చేయించాలని తన వద్దకు పోలీసులను పంపారని విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌లో సిపి శ్రీనివాస్‌రెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు. తన భార్య, కుమారుడిని తెలంగాణ సిసిఎస్‌ పోలీసులు అరెస్టు చేసింది వాస్తవమని, కోర్టులో మాత్రం విచారణ కోసం అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారని, వారిపై ప్రయివేట్‌ కంప్లైంట్‌ ఇస్తామని తెలిపారు.
భూ వివాదం కేసులో తొలుత మాండ్ర శివానందరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు సోమవారం తెలంగాణ పోలీసులు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులోని శివానందరెడ్డి నివాసానికి వచ్చారు. వారెంట్‌ ఇచ్చిన తరువాత తనను అదుపులోకి తీసుకోవాలని ఆయన కోరడంతో పోలీసులు వెనుదిరిగారు.

➡️