రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. 1987 బ్యాచ్‌కు చెందిన రిటైర్డు ఐఎఎస్‌ అధికారి రామ్మోహన్‌ మిశ్రాను ప్రత్యేక సాధారణ పరిశీలకులుగా (స్పెషల్‌ జనరల్‌ అబ్జర్వర్‌), 1984 ఐపిఎస్‌ బ్యాచ్‌కు చెందిన రిటైర్డు ఐపిఎస్‌ అధికారి దీపక్‌ మిశ్రాను స్పెషల్‌ పోలీస్‌ పరిశీలకులుగా, 1983 బ్యాచ్‌కు చెందిన రిటైర్డు ఐఆర్‌ఎస్‌ అధికారి నీనా నిగమ్‌ను స్పెషల్‌ ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమిస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను పరిశీలించటం, ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను పటిష్టంగా అమలుపరిచేలా చూడటం, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, సమస్యాత్మకమైన ప్రాంతాలతోపాటు ఓటర్లను ఆకర్షించే, ప్రేరేపించే తాయిలాల నియంత్రణ, తదితర అంశాలపైనా వీరు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కాగా, ఈ ముగ్గురూ వచ్చేవారం నుంచి రాష్ట్రంలో పర్యటించబోతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్‌పిలు, ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశాల్లోనూ వీరు పాల్గని సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు.

➡️