ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్టు

Mar 4,2024 20:36 #Smuggling, #Tirupati district

28 దుంగలు స్వాధీనం

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం) : అన్నమయ్య జిల్లా సురబీ ఫారెస్ట్‌ బీటు పరిధిలో ఇద్దరు ఎర్ర చందనం స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 28 చందనం దుంగలను, ఒక టాటా మెగా ఎక్సెల్‌ లగేజీ వ్యాను, మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒకరు పరారయ్యారు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌పి శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు ఆర్‌ఎస్‌ఐ రాఘవేంద్ర బఅందం ఆదివారం అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గువ్వల చెరువు సెక్షన్‌ పరిధిలో కూబింగ్‌ చేపట్టింది. సోమవారం తెల్లవారుజామున సురబీ ఫారెస్ట్‌ బీటు పరిధిలోని హిందుకూరవాండ్ల పల్లి-తూముకుంట మెయిన్‌ రోడ్డుపైన తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న లగేజీ వాహనం టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బందిని చూడగానే వాహనాన్ని తిప్పుకుని వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వెంటపడ్డారు. దీంతో స్మగ్లర్లు వాహనాన్ని వదిలిపెట్టి పారిపోడానికి ప్రయత్నించగా వారిలో ఇద్దరిని పట్టుకున్నారు. మరో వ్యక్తి పరారయ్యాడు. అతని కోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడ్డవారిలో గాలివీడు మండలానికి చెందిన పచ్చిపాల యోగీశ్వర నాయుడు, ఇర్రి పెద్దినాయుడు ఉన్నారు.. సిఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️