ఆశా వర్కర్లుగా మార్పు చేయాలి 

Feb 15,2024 09:13 #Asha Workers, #Protest
asha workers protest

సిహెచ్‌డబ్ల్యూల రిలే దీక్షలు ప్రారంభం

ప్రజాశక్తి- యంత్రాంగం : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు (సిహెచ్‌డబ్ల్యులు) బుధవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమను ఆశా వర్కర్లుగా మార్పు చేయాలని, రూ.పది వేలు వేతనం ఇవ్వాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎల వద్ద ఎపి కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు ఆధ్వర్యాన) ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లు నిర్వహిస్తున్న విధుల వంటివే తామూ నిర్వహిస్తామని తెలిపారు. తమకు రూ.4 వేల మాత్రమే వేతనం ఇస్తున్నారని, ఈ మొత్తం ఏ మాత్రమూ చాలక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు యూనిఫారం, సెల్‌ఫోన్లు, మెడికల్‌ కిట్లు ఇవ్వాలని, బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలపై గతంలో అనేకమార్లు అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే దళల వారీగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 19న ఐటిడిఎను ముట్టడిస్తామని హెచ్చరించారు. సీతంపేటలో దీక్షా శిబిరాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, పార్వతీపురంలో సిఐటియు నాయకులు గొర్లె వెంకటరమణ ప్రారంభించారు. పాడేరులో సిహెచ్‌డబ్ల్యులను ఉద్దేశించి సిఐటియు అల్లూరి జిల్లా సహాయ కార్యదర్శి ఎల్‌.సుందరరావు ప్రసంగించారు.

➡️