పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు

ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసిపి అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు నమోదైంది. మచిలీపట్నం 8వ డివిజన్‌ విశ్వబ్రాహ్మణ కాలనీలో గురువారం వైసిపి శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ఈ క్రమంలో జనసేన నేత కర్రి మహేష్‌ ఇంటి వద్ద వైసిపి, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసిపి కార్యకర్తలు తన ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశారని, ఇంట్లోని వస్తువులను పగులగొట్టారని కర్రి మహేష్‌ మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి పేర్ని కిట్టుతోపాటు మొత్తం ఆరుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఏ1గా పేర్ని కిట్టును పోలీసులు పేర్కొన్నారు. ఆయనతో పాటు చిలకలపూడి గాంధీ, చిలంకుర్తి వినరు, శీనయ్య, ధనబాబు, లంకే రమేశ్‌ను నిందితులుగా చేర్చారు. వీరిలో కిట్టు మినహా మిగతా ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. మరోవైపు బాధితుడు కర్రి మహేష్‌తో పాటు మరో ముగ్గురిపైన ఎస్‌సి, ఎస్‌టి, అట్రాసిటీ కేసు నమోదైంది. తనను కులంపేరుతో దూషించారంటూ వైసిపికి చెందిన నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.

➡️