బొగ్గు ఉత్పత్తిలో సాంకేతిక సహకారం – సింగరేణి సిఎండితో ఆస్ట్రేలియా కమిషనర్‌ భేటీ

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :రానున్న ఐదేళ్లలో సింగరేణి సంస్థ నిర్దేశించుకున్న 100 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్య సాధనకు అవసరమైన ఆధునిక మైనింగ్‌ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక విషయాల్లో సహకారం అందిస్తామని ఆస్ట్రేలియా వాణిజ్య, పెట్టుబడుల శాఖ కమిషనర్‌ డెనిస్‌ ఈటెన్‌ అన్నారు. సింగరేణి సంస్థ సిఎండి ఎన్‌.బలరామ్‌తో గురువారం హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో పత్యేకంగా సమావేశమయ్యారు. బలరామ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం సింగరేణిలో ఉపయోగిస్తున్న సాంకేతికత, ఈ ఏడాది సాధించిన రికార్డు ఉత్పత్తి, రవాణా, టర్నోవర్‌, సంస్థ వృద్ధిరేటును ఆస్ట్రేలియా కమిషనర్‌కు వివరించారు. సింగరేణి బగ్గు ఉత్పత్తితో పాటు వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా థర్మల్‌, సోలార్‌ రంగాల్లోకి విజయవంతంగా అడుగుపెట్టిందని వివరించారు. వ్యాపార విస్తరణలో భాగంగా ఇతర రంగాల్లోని అవకాశాలను సైతం పూర్తిగా పరిశీలిస్తున్నట్టు గుర్తుచేశారు. గతంలో ఆస్ట్రేలియా దేశానికి చెందిన సింటార్స్‌ తదితర సంస్థలతో మైనింగ్‌, రక్షణ, సాంకేతిక విషయాల్లో సహకారం తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. సింగరేణిలో అమలవుతున్న సాంకేతికతను, సంస్థ చేపడుతున్న నూతన వ్యాపార విస్తరణ చర్యలను స్వయంగా చూసేందుకు నవంబరులో ఆస్ట్రేలియా బృందం సింగరేణి ప్రాంతంలో పర్యటించనుందని కమిషనర్‌ డెనిస్‌ ఈటెన్‌ తెలిపారు. మైనింగ్‌ రంగంలో నూతన సాంకేతికతలపై తమ దేశంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. సంస్థ ప్రగతికి దోహదపడే అంశాలపై తగిన సహకారాన్ని అవసరమైనప్పుడు స్వీకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావశంలో సింగరేణి వ్యాపార అభివృద్ధి మేనేజర్‌ డి రామకృష్ణ పాల్గొన్నారు.

➡️