బాలయ్య హ్యాట్రిక్‌ కొట్టేనా?

  •  ఆవిర్భావం నుంచి టిడిపికి కంచుకోట హిందూపురం

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : సినీనటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధిస్తారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. హిందూపురం నియోజకవర్గం అంటేనే టిడిపికి కంచుకోటగా పిలుస్తారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అక్కడ టిడిపి ఓటమి చెందిన దాఖలాల్లేవు. 1983 నుంచి 2019 వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. ఇక్కడి నుంచి టిడిపి వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు మూడుసార్లు విజయం సాధించారు. అందుకే ఈ నియోజకవర్గాన్ని హిందూపురంతోపాటు నందమూరి పురంగానూ పిలుస్తూ ఉంటారు.

ప్రత్యర్థుల్లోని గ్రూపులతోనే లబ్ధి
హిందూపురంలో ఇన్నేళ్లుగా టిడిపి విజయం సాధిస్తూ రావడానికి కారణం టిడిపి బలం కొంత కారణమైతే, ప్రత్యర్థుల్లోని ముఠాపోరులు ప్రధాన కారణంగా ఉంటూ వస్తున్నాయి. ఈ గ్రూపులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఈ గ్రూపు తగాదాలతోనే నవీన్‌నిశ్చల్‌ను కాదని చివరి నిమిషంలో రిటైర్డు ఐపిఎస్‌ అధికారి మహ్మద్‌ ఇక్బాల్‌ను తెచ్చి వైసిపి అభ్యర్థిగా పెట్టింది. స్థానికేతరుడు అయిన మహ్మద్‌ ఇక్బాల్‌ అనుకున్నంతగా రాణించలేకపోయారు. అయినా వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించారు. వైసిపి అధికారంలోకి వచ్చాక అక్కడి గ్రూపు తగాదాలు మరింత పెరగడంతోపాటు రామకృష్ణారెడ్డి అనే వైసిపి నాయకుడు హత్య జరిగింది. ఈ తగాదాల నడుమ ఇక్బాల్‌ను ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి కొత్త అభ్యర్థి, స్థానికేతరులైన దీపికను తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమెకు కూడా స్థానిక నాయకుల నుంచి పెద్దగా సహకరం లభించడం లేదు. ఇప్పటికే మహ్మద్‌ ఇక్బాల్‌ వైసిపిని వీడి టిడిపిలో చేరారు. ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వరుసగా పార్టీని వీడుతున్నారు. వీటిని చక్కబెట్టేందుకు వైసిపి రాయలసీమ ప్రాంత ఇన్‌ఛార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు. అయితే పైకి కలిసినట్టు కనిపిస్తున్నా తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తగాదాలే టిడిపికి సానుకూలంగా మారుతూ వస్తున్నాయి.

ఎన్టీయార్‌… వరుసగా మూడు తడవలు
1985, 1989, 1994లో వరుసగా మూడుసార్లు టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2014 వరకు నందమూరి కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయనప్పటికీ టిడిపి అభ్యర్థులే ఇక్కడ గెలుపొందుతూ వచ్చారు. 2014లో మొదటిసారి బాలకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి నవీన్‌ నిశ్చల్‌పై 16,196 వేల ఓట్ల మెజార్టీతో బాలకృష్ణ గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర మంతటా వైసిపి గాలి వీచినా.. హిందూపురంలో మాత్రం 18,028 ఓట్ల మెజార్టీతో బాలకృష్ణ గెలుపొందారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో మూడోసారి బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన నామినేషన్‌ సైతం దాఖలు చేశారు. ఇక్కడ వైసిపి నుంచి దీపిక అనేక కొత్త అభ్యర్థిని ఆ పార్టీ బరిలో దింపింది.

➡️