మనోవికాసాన్ని పెంపొందించే బాలోత్సవాలు

Dec 23,2023 10:25 #Balotsavam

 

ముగింపు సభలో వక్తలు

ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ (గుంటూరు జిల్లా) : చిన్నారులు మనోవికాసాన్ని పెంపొందించేందుకు బాలోత్సవం వంటి వేదికలు ఎంతగానో దోహదం చేస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. గుంటూరు మంగళగిరి ఎంటిఎంసి పరిధిలోని ఎర్రబాలెం డాన్‌భాస్కో హై స్కూల్‌ ఆవరణలో ఎంఎస్‌ స్వామినాథన్‌ వేదికపై గత రెండ్రోజుల నుండి జరుగుతున్న మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం రెండవ పిల్లల పండగ శుక్రవారం ముగిసింది. ముగింపు బహుమతి ప్రదానోత్సవ సభకు బాలోత్సవం మంగళగిరి అధ్యక్షులు వివి ప్రసాద్‌ అధ్యక్షత వహించారు. సభలో రోటరీ క్లబ్‌ మంగళగిరి ప్రాజెక్ట్‌ చైర్మన్‌ అనిల్‌ చక్రవర్తి, ప్రెసిడెంట్‌ అందే రేవంత్‌ మాట్లాడారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తేనే ఉన్నత స్థితికి చేరుకుంటారని తెలిపారు. అందుకు బాలోత్సవాలు తోడ్పడతాయన్నారు. అమరావతి బాలోత్సవం వ్యవస్థాపకులు పిన్నమనేని మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి కొండలరావు మాట్లాడుతూ వేలాది మందితో మంగళగిరిలో బాలోత్సవం నిర్వహించామని, రాష్ట్రవ్యాప్తంగా 43 చోట్ల ఈ తరహా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బాలోత్సవం గౌరవ అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, విజె డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ పి రాజశేఖర్‌, డాన్‌ బాస్కో హై స్కూల్‌ ప్రతినిధులు ఫాదర్‌ పికె జోష్‌ తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు.చిన్నారుల ప్రదర్శనకు విశేష స్పందన చిన్నారులు లఘు నాటికల రూపంలో రైతుల సాధక బాధకాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. దేశభక్తిని పెంపొందించేలా కొన్ని నాటికలు, గేయాలు, పెద్దలను ఉపాధ్యాయులను ఏ విధంగా గౌరవించాలో తెలియజెప్పేలా ప్రదర్శనలు ఆకర్శించాయి. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబిమించేలా కోలాటం, జానపద, శాస్త్రీయ నృత్యాలు చేస్తూ సంక్రాంతి పండుగ ముందే వచ్చినంత సందడి చేశారు.

➡️