రాజంపేటలో రసవత్తర పోరు!

  • మాజీ సిఎం కిరణ్‌కు అసంతృప్తుల సెగ

ప్రజాశక్తి – కడప ప్రతినిధి : రాజంపేట పార్లమెంటులో రసవత్తర పోరుకు తెరలేచింది. వైసిపి తరపున పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, కూటమి తరపున బిజెపి అభ్యర్థి మాజీ సిఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బరిలో నిలిచారు. ఇద్దరు అంగ, అర్థ, అనుచర బలం కలిగినవారు కావడంతో రాజంపేటలో రాజకీయం ఉత్కంఠభరితంగా సాగుతోంది. రాజంపేట, రాయచోటి, తంబళ్లపల్లి, మదనపల్లి నియోజకవర్గాల్లో టికెట్లు దక్కని అసంతృప్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాయలసీమ జిల్లాల స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ను వెనక్కి తీసుకోవడం, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఫీజుబులిటీ లేదనడం, రాయలసీమ డిక్లరేషన్‌ను అమలు చేయకపోవడంతో బిజెపి పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 8న పీలేరులో ప్రధాన మంత్రి మోడీ పర్యటనపై ఆశలు పెంచుకున్నట్లు కనిపిస్తోంది.
రాజంపేట పార్లమెంటు ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. మిథున్‌రెడ్డి, కిరణ్‌ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి బషీర్‌ సహా 16 మంది బరిలో నిలిచారు. రాజంపేట పార్లమెంట్‌లో రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి, పుంగనూరు నియోజకవర్గాలున్నాయి. 14,26,834 మంది ఓటర్లు ఉన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పీలేరు సొంత నియోజకవర్గంలో బలంగా ఉన్న సంగతి తెలిసిందే. వైసిపి అభ్యర్థి సొంత నియోజకవర్గమైన పుంగనూరు సహా తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో బలాన్ని కలిగి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో రాజంపేట పార్లమెంటులో హోరాహోరీ పోటీ నెలకొంది.

అసంతృప్తుల సెగలో కూటమి
కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి అసంతృప్తుల సెగ తగులుతోంది. రాజంపేట అసెంబ్లీ ఇన్‌ఛార్జి బత్యాల చెంగల్రాయుడు, మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దుమ్మలపాటి రమేష్‌, రామ్‌దాస్‌ చౌదరి, తంబళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే శంకరయాదవ్‌, మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డికి టిడిపి టికెట్లు లభించలేదనే ఉద్దేశంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రమేష్‌రెడ్డి వైసిపిలో చేరిపోయారు. వీరందరూ రెబెల్స్‌గా మారి టిడిపి కూటమి అభ్యర్థులకు సవాల్‌ విసురుతున్నారు. రాజంపేట వైసిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి టికెట్‌ లభించలేదనే ఉద్దేశంతో వైసిపికి సహాయ నిరాకరణ చేయడం, ఆయన అనుచరులు వందలాది మంది టిడిపిలో చేరడంతో తీవ్ర పోటీ నెలకొంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి తరపున పురందేశ్వరి బరిలో నిలిచినా దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

అధినేతల పర్యటనపైనే ఆశలు
కూటమిలో కుంగుబాటు ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధినేతల పర్యటనపై కూటమి దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోడీ, టిడిపి అధినేత చంద్రబాబు పర్యటనలు ఖరారు చేసే పనుల్లో నిమగమయ్యారు. ఈ నెల 8న పీలేరులో ప్రధాని మోడీ సభ నిర్వహించనున్నారు.

ఓట్ల బదిలీపై సందేహాలు
కూటమి అభ్యర్థి నల్లారిని ఓట్ల బదిలీపై సందేహం వెంటాడుతోంది. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ నిధులను రాష్ట్ర ఖాతా నుంచి వెనక్కి తీసుకోవడం, కడప జిల్లాకు ఇవ్వాల్సిన ఉక్కు పరిశ్రమకు ఫీజుబిలిటీ పేరుతో సహాయ నిరాకరణ చేయడం, బిజెపి నాయకత్వం కర్నూలులో చేసిన రాయలసీమ డిక్లరేషన్‌ అమలు, జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2 ప్యాకేజీలకు పర్యావరణ అనుమతుల విషయంలో నిస్సహాయత నేపథ్యంలో మేధావులు, విద్యావంతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బిజెపి అభ్యర్థికి టిడిపి, జనసేన ఓట్ల బదిలీపై సందేహం నెలకొంది.

➡️