ప్రజలతో ముచ్చటిస్తూ.. కార్మికలతో మమేకమై..

  • సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం

ప్రజాశక్తి-యంత్రాంగం : సిపిఎం అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. బుధవారం ఆయా నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. ప్రజలతో ముచ్చటిస్తూ కార్మికులతో మమేకమవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ప్రచారం సాగించారు. సమస్యల పరిష్కారం కోసం సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
విజయవాడలోని అజిత్‌సింగ్‌ నగర్‌, ప్రకాష్‌నగర్‌, శాంతినగర్‌, గవర్నర్‌పేట, బీసెంట్‌ రోడ్లలో సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్‌ బాబూరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు, సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో పాల్గొని పతాకాలను ఆవిష్కరించారు. ఆలీబేగ్‌ స్ట్రీట్‌లో రిక్షా తొక్కుతూ కార్మికులను ఉత్సాహపరిచారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో దోపిడీని ఎదుర్కొని, పాలకుల విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్మికవర్గం సమైక్యతతో ముందుకు సాగాలని కోరారు. శ్రామికుల శ్రమ లేనిదే సంపద, సమాజం లేదని పేర్కొన్నారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. దోపిడీదార్లకు అండగా నిలుస్తున్న పాలకుల నిజస్వరూపాన్ని గమనించాలని కోరారు.


కృష్ణా జిల్లా గన్నవరంలో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి కళ్ళం వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ మచిలీపట్నం ఎంపి అభ్యర్థి గొల్లు కృష్ణ ప్రచారం నిర్వహిస్తూ… గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన వైసిపికి గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి నేతలు ఒకరినొకరు తిట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయకపోతే దేశం, రాష్ట్రం సర్వనాశనం అవుతాయని హెచ్చరించారు.


కర్నూలు జిల్లా కల్లూరు అర్బన్‌ సూర్యనారాయణ దేవాలయం, బాలాజీ నగర్‌, విజి నగర్‌, శారద నగర్‌, శ్రీలక్ష్మి నగర్‌, విద్యా నగర్‌, రుక్మిణి నగర్‌ ప్రాంతాల్లో పాణ్యం నియోజకవర్గ అభ్యర్థి డి.గౌస్‌ దేశారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కర్నూలు నగరాన్ని దౌర్జన్యకారుల నుంచి కాపాడతామని, సిపిఎంను గెలిపిస్తే అక్రమ కబ్జాలను ఆపి అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఓటర్లకు తెలిపారు. నగరంలో రెండో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకరరావు రోడ్‌ షో నిర్వహించారు. తొలుత ముగ్గురోడ్డులోని బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముగ్గురోడ్డు నుంచి ప్రారంభమైన రోడ్‌ షో ఆర్‌ఎంఎస్‌ కాలనీ, లంబాడీపేట, పోతురాజుస్వామి గుడి, మున్సిపల్‌ జోనల్‌ కార్యాలయం, పద్మశాలీ బజార్‌, ఉండవల్లి సెంటర్‌ మీదుగా పోలకంపాడు వరకు సాగింది. ఈ సందర్భంగా పాస్టర్లు, చిరువ్యాపారులు, ఆటోడ్రైవర్లు జొన్నా శివశంకరరావుకు మద్దతు తెలిపారు. పోలకంపాడు, బాపనయ్యనగర్‌ ప్రాంత వాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా జొన్నా శివశంకరరావు మాట్లాడుతూ తనను గెలిపిస్తే నియోజవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం కించుమండ వారపుసంతలో అరకు ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్స దుకాణదారులను, ప్రజలను కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ముంచంగిపుట్టు, హుకుంపేట మండలాల్లోనూ ప్రచారం చేపట్టారు. గిరిజన బతుకులు బాగుపడాలంటే, హక్కులు, చట్టాలకు రక్షణ ఉండాలంటే పార్లమెంటు, అసెంబ్లీలో ప్రశ్నించే వ్యక్తి ఉండాలని అన్నారు.


చింతూరు మండలంలో రంపచోడవరం అభ్యర్థి లోతా రామారావు రోడ్‌షో నిర్వహించారు. ఎర్రంపేట గ్రామం నుండి ప్రారంభమైన రోడ్‌షోలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవి కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఎమ్‌డి.హబీబ్‌ పాల్గొన్నారు. ప్రచార వాహనంపై లోతా రామారావు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మంతెన సీతారాం మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి, ఆదివాసీల హక్కులు, చట్టాల రక్షణకు రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి రామారావును, అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్సను గెలిపించాలని కోరారు. బండారు రవి కుమార్‌ మాట్లాడుతూ బిజెపి, టిడిపి, వైసిపిలను ఓడించాలని పిలుపునిచ్చారు. విశాఖలోని ఫకీర్‌తక్యా, షీలానగర్‌ తదితరచోట్ల గాజువాక అభ్యర్థి ఎం.జగ్గునాయుడును గెలిపించాలని కోరుతూ సిపిఎం కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో కురుపాం నియోజకవర్గ అభ్యర్థి మండంగి రమణ రోడ్‌ షో నిర్వహించారు. రోడ్‌ షోలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుబ్బారావమ్మ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ, అరకు ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్స గెలిపించి గిరిజన హక్కులను కాపాడుకోవాలని కోరారు.

➡️