రాష్ట్రానికి బిజెపి తీరని ద్రోహం

Apr 8,2024 20:29 #BJP Govt, #coments, #R Narayanamurthy
  •  ప్రత్యేక హోదా ఊసు లేదు
  •  సినీ నటుడు ఆర్‌ నారాయణమూర్తి

ప్రజాశక్తి – పలాస : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని 2014 ఎన్నికల్లో హామీనిచ్చిన ప్రధాని మోడీకి, ఆ హామీని అమలు చేసేందుకు పదేళ్లు సరిపోలేదా అని ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, విశాఖ రైల్వే జోన్‌, ఇతర విభజన హామీలేవీ అమలు చేయకుండా మొండిచేయి చూపారని విమర్శించారు. రాష్ట్రానికి కొత్తగా ఏం ఇవ్వకపోగా పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ నిర్వహణకు కావాల్సిన ముడిసరుకును కేటాయించకుండా నష్టాల బారిన పడే విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో ఎంతోమంది మృత్యువాత పడుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కిడ్నీ వ్యాధి నిర్మూలనకు, రోగులకు మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నీ వ్యాధి మూలాలను కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, 200 పడకల ఆస్పత్రి, ఉద్దాన ప్రాంతానికి శుద్ధజలాలు అందించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశారని చెప్పారు. సమావేశంలో డాక్టర్‌ వై కృష్ణమూర్తి, డాక్టర్‌ మట్ట ఖగేశ్వరరావు, కిడ్నీ ఆస్పత్రి నెఫ్రాలజిస్టు బాలాజీ పాల్గొన్నారు.

➡️