బిజెపిని తుక్కుగా ఓడించాలి- ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌

Nov 23,2023 21:42 #Chalasani Srinivas, #press meet

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖ) విభజన హామీ అమలు చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగిస్తోన్న బిజెపిని, ఆ పార్టీతో జట్టు కట్టి పోటీ చేసే పార్టీలను తక్కుగా ఓడించాలని ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌ కోరారు. విశాఖ డాబాగార్డెన్స్‌లోని విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విభజన తర్వాత రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు జాతికి అన్యాయం చేసిన బిజెపిని తెలంగాణలో ప్రజలు తిరస్కరిస్తున్నారని, అక్కడ ఆ పార్టీ చిత్తుగా ఓడిపోతుందని జోష్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ పట్ల బిజెపి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతతో ఉందన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తోన్న బిజెపితో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు జతకట్టడం సరికాదన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా 25 పార్లమెంట్‌ స్థానాల్లో గెలిపిస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని జగన్‌మోహన్‌రెడ్డి మాటతప్పారని విమర్శించారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు, విశాఖ రైల్వే జోన్‌, పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయడానికి నిధులు సాధించడంలో జగన్‌మోహన్‌రెడ్డి విఫలమయ్యారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీలను రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆదరించాలని కోరారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను స్టేటజిక్‌ సేల్‌ పేరుతో అమ్మాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ సిఎం క్షేత్రపాల్‌, టిడిపి నాయకులు ఆడారి కిషోర్‌ కుమార్‌, ప్రత్యేక హోదా సాధన సమితి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ అప్పలనాయుడు పాల్గొన్నారు.

➡️