బిజెపిని ఓడించాలి….వామపక్ష అభ్యర్థులను గెలిపించాలి

Apr 25,2024 18:50 #cpm

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్
మత విద్వేషాలు రెచ్చగొడుతూ, మత ఉన్మాదాన్ని రేపుతున్న బిజెపిని ఓడించాలని, వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. గురువారం ఎంటి ఎం సీ పరిధిలోని వడ్డేశ్వరం జాతీయ రహదారి వద్ద ఉన్న కేబీ భవన్‌ లో సిపిఎం తాడేపల్లి మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సిపిఎం మండల నాయకులు నల్లపు కిషోర్‌ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాశం రామారావు మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం విలువల్లేని దిగజారుడు రాజకీయం చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టేందుకు నరేంద్ర మోడీ ప్రసంగాలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పదేళ్లకాలంలో పెద్దఎత్తున మతపరమైన దాడులు జరిగాయన్నారు. లౌకిక భారతదేశంలో ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్లు, దళితుల పైన దాడులు పెరిగిపోతుండటం ఆందోళన కల్గించే విషయమన్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి విధానాలను వ్యతిరేకిస్తూ, వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ఇండియా బ్లాక్‌ కూటమిగా ఏర్పడ్డాయన్నారు. దేశాన్ని మతోన్మాద శక్తుల నుండి రక్షించుకునేందుకు రానున్న ఎన్నికలలో ఇండియా కూటమి పార్టీలైన సిపిఎం, సిపిఐ అభ్యర్థులను ఓట్లు వేసి, గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, పల్నాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.గోపాలరావు, నాయకురాలు వంకాయలపాటి శివ నాగరాణి, తాడేపల్లి మండల కార్యదర్శి దొంతి రెడ్డి వెంకటరెడ్డి, తాడేపల్లి మండల నాయకులు కాజా వెంకటేశ్వరరావు, బొప్పన గోపాల్‌ రావు, పల్లె కృష్ణ, కంచర్ల సాంబశివరావు, ఎన్‌.వి రాజ్‌, రాజ్‌ కుమార్‌, బత్తుల సంసోను, ఎస్‌.కె గన్‌, ఆరుమళ్ళ నాగిరెడ్డి తదితరులు పాల్గన్నారు.

జొన్నా శివశంకరరావు ప్రచారానికి ఆదరణ

తాడేపల్లి మండలం ఉండవల్లిలో సిపిఎం మంగళగిరి అభ్యర్థిగా పోటీచేస్తున్న జొన్నా శివశంకర్‌ ప్రచారానికి విశేష ఆదరణ లభించింది. ఉండవల్లి పంచాయతీ సర్పంచ్‌గా ఆయన 20 ఏళ్లపాటు పనిచేసిన విషయం తెలిసిందే. ఆ కాలంలో జరిగిన అభివృద్ధిని గుర్తుచేస్తూ నాయకులు గురువారంనాడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.జొన్నా శివశంకరరావుకు అడుగడుగునా ప్రజాదరణ లభించింది. హారతులిచ్చి మహిళలు స్వాగతించారు. అంబేద్కర్‌ నగర్లో డాక్టర్‌ అంబేద్కర్‌, బాబు జగజీవన్‌ రామ్‌ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. జొన్నాతోపాటు ఉండవల్లి రోడ్‌ షోలో గుంటూరు పార్లమెంట్‌ సిపిఐ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్‌ పాల్గన్నారు. ఈ సందర్భంగా సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గుంటూరు పార్లమెంట్‌ సిపిఐ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్‌, మంగళగిరి అసెంబ్లీ సీపీఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావుకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. తొలుత రోడ్‌షోను సిపిఎం సీనియర్‌ నాయకులు ఈమని రామారావు, కాట్రగడ్డ శివరామకృష్ణయ్య జెండా ఊపి ప్రారంభించారు. సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, రాజధాని డివిజన్‌ కార్యదర్శి వర్గ సభ్యులు వల్లభాపురం వెంకటేశ్వరరావు, ఎం భాగ్యరాజు, సిపిఎం నాయకులు ఓలేటి శాంతి, ఆర్‌ వి నరసింహారావు, జి రవిబాబు, ఎస్కే ఎర్ర పీ రు, డి వెంకట్‌ రెడ్డి, బూరుగ వెంకటేశ్వర్లు, కే జగదీశ్వర్‌ రెడ్డిపి గాంధీ టి బక్కిరెడ్డి, కె.రామకృష్ణ,కె.ప్రకాశరావు, గడ్డం కృష్ణ, కుంభ ఆంజనేయులు, పార్థసారథి, ప్రజానాట్యమండలి బాధ్యులు దేవరకొండ శ్రీనివాసరావు, పెద్దిరాజు,సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరపతయ్య, నాయకులు కంచర్ల కాశయ్య, జాలాది జానుబాబు, ఎం.డాంగే వెంకటయ్య, కాంగ్రెస్‌ ాయకులు రేమినిశెట్టి హనుమంతరావు తదితరులు పాల్గన్నారు.

విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదు -సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం

ప్రజాశక్తి-అనకాపల్లి : అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విద్వేశపూరిత ప్రసంగాన్ని సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎన్నికల్లో తమ ప్రభుత్వం వద్ద ఉన్న అభివృద్ధి ప్రణాళికలు, ఎజెండాలు వెల్లడిరచకుండా ఆర్టికల్‌ 370 రద్దు, రామమందిరం గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఉపసంహరణ ప్రకటన, సొంత గనులు కేటాయింపు వంటి ప్రాధాన్యత అంశాలను విస్మరించి అధికారంలోకి వస్తే ఒకే దేశం, ఒకే ఎన్నికలు అమలు చేస్తామని చెప్పడం ప్రజాస్వామిక హక్కులను, విలువలను దెబ్బతియ్యడమేనని పేర్కొన్నారు. పేదరికం, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకుండా రామమందిరం నిర్మాణాన్ని విజయంగా చెప్పుకోవడం బాధ్యతా రహితంగా మాట్లాడడమేనన్నారు. ఎన్నికల ప్రసంగాల్లో మత విద్వేశాలను రెచ్చగొట్టి లబ్ధిపొందడానికి బిజెపి పథకం ప్రకారం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలు అప్రమత్తమై బిజెపి అభ్యర్ధి సిఎం రమేష్‌ను, ఆ పార్టీకి మద్ధతు ఇస్తున్న టిడిపి, జనసేన పార్టీలను, దానికి అంటకాగుతున్న పార్టీలను ఓడిరచడం ద్వారా దేశ ఐక్యతను, మత సామరస్యాన్ని కాపాడుకోగలమని స్పష్టంచేశారు. ఎన్నికల ప్రసంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు, ఎజెండాలు ప్రజల ముందు వుంచకుండా వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలతో జిల్లా ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యలను ప్రధాన పార్టీలు విస్మరించడం సరికాదన్నారు. రక్షణ శాఖా మంత్రి ఎన్నికల ప్రచారానికి అనకాపల్లికి వస్తున్న సందర్భంగా స్టీల్‌ప్లాంట్‌ కార్మికులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమైన చర్యగా పేర్కొన్నారు. ఈ చర్య ద్వారానే ఈ ప్రాంతం పట్ల వారికి ఉన్న ప్రేమ అర్ధమౌతుందని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపేశక్తి సిఎం రమేష్‌కి ఉందనడం పచ్చి మోసం తప్ప మరొకటికాదని స్పష్టంచేశారు. ఆయనకు చిత్తశుద్ధి వుంటే స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని మోడీతో ప్రకటించి, ప్లాంట్‌కు సొంత గనులు కేటాయిస్తున్నట్లు చెప్పించాలని డిమాండ్‌చేశారు. ఎంపి అభ్యర్థి ముత్యాలనాయుడుకు ఇంగ్లీష్‌ రాదని తక్కువ చేసి మాట్లాడారన్నారు. సిఎం రమేష్‌ ఇదే విషయాన్ని అనకాపల్లి జిల్లా వారికి సరిగ్గా మాట్లాడడం రాదని పదేపదే చెప్పడం అంటే అనకాపల్లి జిల్లా ప్రజలను అవమానపర్చినట్లే తప్ప మరొకటి కాదని గుర్తించాలని కోరారు. అనకాపల్లిజిల్లాకి వలస వచ్చి పచ్చని పల్లెలో విద్వేశాలు రెచ్చగొట్టాలని చూస్తున్న ఈ వలసపక్షిని ఓడించాలని జిల్లా ప్రజలకు సిపిఎం జిల్లా కమిటీ తరపున కె.లోకనాథం విజ్ఞప్తిచేశారు. జిల్లాలో ప్రధాన అంశాలేవి ప్రస్తావించకుండా విమర్శలకే పరిమితమయ్యారన్నారు. పోలవరం ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, సిపిఎస్‌ రద్దు వంటి అశాలపైన, పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉపాధి కల్పన వంటి వాటిపై తన వైఖరిని వెల్లడించకుండా తప్పదాటు వైఖరిని ప్రదర్శించారు. మూసివేసిన తుమ్మపాల, ఏటికొప్పాక, తాండవ షుగర్‌ ఫ్యాక్టరీల పునరుద్దరణ ప్రస్తావన లేకపోవడం అంటే జిల్లా ప్రజలను విస్మరించడమేనన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ వివిధ రూపాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న కూటమి ఎంపి అభ్యర్థిపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేస్తుందన్నారు.

అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి అప్పలనర్సను గెలిపించాలి

బిజెపి కూటమిని ఓడించి ఇండియా కూటమి బలపరిచిన అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి అప్పలనర్సను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాథం పిలుపునిచ్చారు స్థానిక సిపిఎం కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

➡️