రైల్వేపై బిజెపి కపట ప్రేమ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు

  • ఆధునీకరణ పేరుతో కార్పొరేట్లకు కట్టుబెట్టే కుట్ర
  • ముగిసిన ‘జన శంఖారావం’ పాదయాత్ర

ప్రజాశక్తి – విజయవాడ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైల్వే రంగంపై కపట ప్రేమ చూపుతోందని, ఎన్నికల జిమ్మిక్కులు చేస్తోందని సిసిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు విమర్శించారు. రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని చెబుతున్న బిజెపి ప్రభుత్వం భారతీయ రైల్వేను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఆరు రోజులపాటు సాగిన ”సిపిఎం జన శంఖారావం” పాదయాత్ర మంగళవారం రాత్రితో ముగిసింది. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు బాబూరావు పాదయాత్ర నిర్వహించారు. ఈ నెల 22న ప్రారంభమైన ఈ పాదయాత్ర చివరి రోజున నగరంలోని కస్తూరిబాయిపేట, గిరిపురం, సీతారాంపురం, మైసూర్‌ కేఫ్‌, చుట్టుగుంట, మారుతినగర్‌ సెంటర్ల మీదుగా సాగింది. ఈ సందర్భంగా రెడ్‌ సర్కిల్‌ సెంటర్లో బెల్లపు శోభనాద్రి విగ్రహానికి, శిఖామణి సెంటర్లో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌, బాబూ జగ్జీవన్‌రావు విగ్రహాలకు బాబూరావు పూలమాలలు వేశారు. ఆయనకు ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. ప్రజలు తమ సమస్యలను పాదయాత్ర దృష్టికి తీసుకొచ్చారు. ”300 యూనిట్లు కరెంటు దాటితే ప్రభుత్వ పథకాలు రావడం లేదని, సెంటు స్థలం ఉన్నా పథకాలు నిలిపేస్తున్నారని, కుంటి సాకులతో పింఛన్లు ఎగ్గొట్టారని’ విన్నవించుకున్నారు. పథకాలపై ప్రచారం తప్ప, అందినది అంతంత మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. బీసెంట్‌ రోడ్డులోని అన్సారీ పార్క్‌ సెంటర్‌లో జరిగిన ముగింపు సభలో బాబూరావు మాట్లాడుతూ రైల్వేలోని అన్ని విభాగాలను ప్రయివేటు వ్యక్తులకు కేంద్రం కట్టబెడుతోందన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి, రైల్వే ఫ్లైఓవర్‌, అండర్‌ బ్రిడ్జిలను కేంద్రం విస్మరించినా రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం నోరుమెదపడంలేదని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోన్న బిజెపికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కాశీనాథ్‌, కె.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

➡️