వైసిపి, టిడిపి రెండూ బీజేపీకి అమ్ముడుపోయినవే

  • రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఏనాడు పోరాటం లేదు
  • కాంగ్రెస్‌తోనే రాష్ట్రానికి హోదా సాధ్యం
  • రచ్చబండలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్‌ షర్మిల

ప్రజాశక్తి-తెనాలి : వైసిపి, టిడిపి రెండూ పార్టీలు కేంద్రంలోని బిజెపి సర్కారుకు అమ్ముడుపోయినవేనని, ఏనాడు రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పోరాటం చేసిన దాఖలాలు లేవని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైయస్‌ షర్మిల ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీని నమ్మండి.. రాజన్న బిడ్డగా హామీ ఇస్తున్నా.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొలకలూరు గ్రామంలో తొలి రచ్చబండ కార్యక్రమంలో ఆమె గురువారం పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్‌ చందు సాంబశివుడు అధ్యక్షతన జరిగిన రచ్చబండలో తొలుత ఆమె ప్రజా సమస్యలను విన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పూర్తిగా న్యాయవిరుద్దమని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు వివరించారు. కనీస విద్యార్హత లేని వ్యక్తులు ప్రభుత్వ నిర్దేశించిన ట్రిబ్యునల్‌లో కొనసాగుతూ భూములపై అజమాయిషి చలాయించే విధంగా ఈ చీకటి జీవో వచ్చిందని ఆరోపించారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి పేదలు నష్టపోకుండా కార్యాచరణ రూపొందించి ఉద్యమించాలని షర్మిలను కోరారు. ఈ మేరకు వినతి పత్రం కూడా సమర్పించారు. అలాగే అమ్మ ఒడి చెల్లింపులో అవకతవకలపై, జగనన్న కాలనీలలో నివేసిన స్థలాల కేటాయింపులు, సామాజిక భద్రత పింఛన్లపై, నిరుద్యోగ సమస్యపై పలువురు ఆమె దృష్టికి తెచ్చారు. మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతాంగానికి నేటికీ పరిహారం అందలేదని, గతేడాది రబీలో నష్టపోయిన జొన్న మొక్కజొన్న రైతులకు కూడా నేటికీ పరిహారం ప్రభుత్వం ఇవ్వలేదని పలువురు కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రచ్చబండలో విన్న సమస్యలపై షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో మధ్యపాన నిషేధానికి ప్రభుత్వం హామీ ఇచ్చి, దానిని విస్మరించిందని మద్యం ఏరులై పారుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. పేదల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నా ప్రభుత్వానికి ఏమాత్రం చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. మద్యం వ్యాపారంలో ప్రభుత్వం నిర్దేశించిన బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని, అది కూడా నగదు రూపంలోనే విక్రయాలని ప్రభుత్వం చెప్పడం కేవలం ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే అన్నారు. పన్నుల రూపంలో వచ్చే సొమ్ము ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు మద్యం, ఇసుక మాఫియా తో కోట్లు గడించిన వైసీపీ ప్రభుత్వం కన్ను ఇప్పుడు పేదల భూములపై పడిందని వాటిని కబ్జా చేసేందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ దొడ్డి దారిన ప్రవేశపెట్టిందని ధ్వజమెత్తారు. ఆ యాక్ట్‌ రద్దు చేయాలని న్యాయవాదులు చేస్తున్న పోరాటం వారి స్వప్రయోజనాల కోసం కాదని, కేవలం పేదల భూమికి రక్షణ కోసమేనని ప్రజలు గమనించాలన్నారు. ఇక అమ్మబడి విషయానికొస్తే స్వయంగా వైసిపి తరఫున తనే ప్రచారం చేసినట్లు చెప్పారు. ఇంటిలో చదువుతున్న ప్రతి బిడ్డకు అమ్మబడి రూ.15వేలు ప్రతిఏటా చెల్లిస్తానని జగనన్న హామీ ఇచ్చి, ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. ఉన్నత చదువులకు ఫీజు రియంబర్స్మెంట్‌ కూడా అటకెక్కిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హౌదాపై ఎలాంటి పోరాటం లేదన్నారు. ఓవైపు నిరుద్యోగం పెరుగిందని, హౌదా లేని కారణంగా పరిశ్రమలు కూడా రావడం లేదని, మరోవైపు రాజధాని అభివద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నిటి ఫలితంగా యువత నిరుద్యోగం బారిన పడుతోందని చెప్పారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉండగా మెగా డీఎస్సీ అంటూ దగా డిఎస్సి ప్రకటించి నిరుద్యోగులను మరోసారి మోసం చేసేందుకు జగన్‌ ప్రభుత్వం తెరతీసిందన్నారు. ఇలాంటి పరిణామాలు అన్నిటిని ప్రజలు గమనించాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని, రాహుల్‌ గాంధీ ప్రధాని కాగానే రాష్ట్రానికి ప్రత్యేక హౌదా పైనే తొలి సంతకం చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ను విశ్వసించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కాంగ్రెస్‌ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఆమె వెంట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జేడి శీలం, రఘువీరారెడ్డి, కొప్పుల రాజు, కనుమూరి బాపిరాజు, షేక్‌ మస్తాన్‌ వలి, కారుమంచి రమాదేవి, పి నాగ సూర్య శశిధరరావు, మల్లవరపు ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

➡️