మండుతున్న సూర్యుడు

Apr 6,2024 16:16 #Konaseema, #Summer, #temparature

40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రత లు
ఎండలతో అల్లాడుతున్న ప్రజలు
కర్ఫ్యూలను తలపిస్తున్న మెయిన్ రోడ్ లు

ప్రజాశక్తి-రామచంద్రపురం : ఈ ఏడాది మార్చి నుండి ఎండలు మండుతున్నాయి ఏప్రిల్ మొదటి వారంలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మెయిన్ రోడ్లన్నీ కర్ఫ్యూ వాతావరణం తలపిస్తున్నాయి. ప్రయాణికులు ఎండలకు భయపడి ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఇక చంటి పిల్లలు వృద్దులు ఎండలకు తాళలేక అల్లాడిపోతున్నారు. ఒక్కపోతతో సతమత మవుతున్న ప్రజలు చెట్ల నీడలకు చేరి సేద తీరుతున్నారు. ఇక ఎండల ఉధృతి పెరగడంతో శీతల పానీయాలకు జనం ఎగబడుతున్నారు. దీంతో పాన్ షాపులు జ్యూస్ సెంటర్ల, చెరుకు రసం షాపుల వద్ద జనం గుమ్ము కొడుతున్నారు. సీతలపానీయాలకు గిరాకీ పెరగడంతో ఒక్కొక్క జ్యూస్ 40 నుండి 60 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. మే నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలో నే నమోదు అవ్వడంతో ఇక మే నెలలో పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు వ్యాపారాలు లేకపోవడంతో వ్యాపారస్తులు సైతం నిట్టూరుస్తున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో వివిధ వ్యాపార సంస్థలు మూతపడుతున్నాయి. గోదావరి జిల్లాలో పచ్చదనం కొబ్బరి చెట్లు నిండుగా ఉన్నప్పటికీ ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. మరో మూడు రోజులపాటు ఉక్క పోత, వడగాల్పులు, ఉంటాయని వాతావరణ శాఖ తెలియజేసింది అదేవిధంగా ప్రజలంతా వడగాల్పులు పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

➡️