అమెరికాలో గుంటూరు విద్యార్థి హత్య

Mar 16,2024 21:02 #America, #Guntur District, #Murder
  •  స్వగ్రామం బుర్రిపాలెంలో అంత్యక్రియలు పూర్తి

ప్రజాశక్తి – తెనాలి (గుంటూరు జిల్లా) : అమెరికాలో గుంటూరు జిల్లా విద్యార్థి దారుణ హత్యకు గురయ్యారు. బోస్టన్‌లోని యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన పరుచూరి అభిజిత్‌ (20)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ నెల 11న యూనివర్సిటీ క్యాంపస్‌లో హత్య చేసినట్లుగా తెలిసింది. సెల్‌ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా అభిజిత్‌ మృతదేహాన్ని పోలీసులు అడవిలో గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అభిజిత్‌ మృతదేహాన్ని శుక్రవారం అర్ధరాత్రి బుర్రిపాలెంకు తరలించారు. మతదేహాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ సందర్శించి నివాళులర్పించారు. శనివారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అభిజిత్‌ తల్లిదండ్రులు పరుచూరి చక్రధర్‌, శ్రీలక్ష్మి దాదాపు 18 ఏళ్ళ క్రితం ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్ళి బోస్టన్‌లో స్థిరపడ్డారు. కుమారుడు అభిజిత్‌ బోస్టన్‌కు 120 కిలో మీటర్ల దూరంలోని మెశాచ్యూసేట్స్‌ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నారు. కొద్దిరోజులు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించడంతో ఆయనను ఇంటికి తీసుకొచ్చేందుకు అభిజిత్‌ పిన్ని కారులో యూనివర్సిటీకి వెళ్లారు. పలుమార్లు అభిజిత్‌కు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో యూనివర్సిటీ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ సిగల్స్‌ ఆధారంగా అభిజిత్‌ను గుర్తించారు. అటవీ ప్రాంతంలో ఓ కారులో హత్యకు గురై విగతజీవిగా పడి ఉన్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

➡️